బెజవాడ బులెటిన్ వార్తలు మాత్రమే కాదు.. మీకు అవసరమైన సమాచారం కూడా
వార్తలు

ఏపీకి తుఫాను ముప్పు… 28న తీరం దాటే అవకాశం

23 October 2026 3 నిమిషాల చదువు
ఏపీకి తుఫాను ముప్పు… 28న తీరం దాటే అవకాశం
28న ఉత్తర కోస్తాలో తీరం దాటే అవకాశం

రాష్ట్రానికి తుఫాను ముప్పు ముంచుకొస్తోంది. వచ్చే మంగళవారం నుంచి ఉత్తర కోస్తాను వర్షాలు ముంచెత్తనున్నాయి. 28న తుఫాను ఉత్తర కోస్తాలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

బంగాళాఖాతంలో ఇప్పుడు మొదలైన కదలిక సోమవారం ఉదయానికి తుఫానుగా మారనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ శుక్రవారం వెల్లడించారు. శనివారానికి వాయుగుండంగా, ఆదివారానికి తీవ్ర వాయుగుండంగా బలపడి, సోమవారానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారుతుందని తెలిపారు.

ఆ తర్వాత రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతుందని చెప్పారు.

ఎక్కడ తీరం దాటుతుంది?

ఇదే ఇప్పుడు అందరి ప్రశ్న. ఉత్తర కోస్తాలోనే తీరం దాటొచ్చని ప్రాథమిక అంచనా. కొన్ని వాతావరణ మోడళ్లు గోదావరి డెల్టాలోని కోనసీమ, కాకినాడ ప్రాంతం వైపు చూపిస్తున్నాయి. తుఫాను తీరానికి దగ్గరయ్యే కొద్దీ కచ్చితమైన స్పష్టత వస్తుంది.

ఎప్పటి నుంచి వర్షాలు?

27వ తేదీ నుంచి శ్రీకాకుళం నుంచి విశాఖ జిల్లా వరకు వర్షాలు మొదలవుతాయి. 28న శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు వర్షాలు మరింత పెరుగుతాయి. ఆ రోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చు.

ఏ జిల్లాలకు ముప్పు ఎక్కువ?

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తుఫాను సమయంలో గంటకు 55 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరికలు ఉన్నాయి.

కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది.

ఈలోగా శుక్రవారం మన్యం, అల్లూరి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.

గతేడాది ఇదే సమయం గుర్తుందా?

సరిగ్గా ఏడాది క్రితం మొంథా తుఫాను కూడా ఇలాగే వచ్చింది. అక్టోబరు 25న బంగాళాఖాతంలో ఏర్పడి, 29 అర్ధరాత్రి నరసాపురం సమీపంలో తీరం దాటింది. అప్పుడు రాష్ట్రంలో 38 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈసారి కూడా దాదాపు అవే తేదీలు, అదే దారి కావడంతో తీర ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలైంది.

ఇప్పుడు ఖరీఫ్ కోతల సమయం. చాలాచోట్ల వరి కోతకు సిద్ధంగా ఉంది. కోసిన ధాన్యం కళ్లాల్లోనే ఉంది. ఈ సమయంలో భారీ వర్షాలు పడితే రైతులకు నష్టం తప్పదు.

అందుకే రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎండీ సూచించారు. కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలి. కళ్లాల్లోని పంటపై టార్పాలిన్లు కప్పుకోవాలి.

సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని హెచ్చరించారు. తదుపరి సూచనలు వచ్చే వరకు ఎవరూ వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు.

షేర్ చేయండి