అదృష్టం తలుపు తడితే ఎవరూ ఆపలేరంటారు. కానీ ఆ అదృష్టాన్ని చేజేతులారా చెత్తబుట్టలో పడేస్తే? ఇటలీలో ఓ మహిళకు జరిగిన ఈ సంఘటన సినిమా క్లైమాక్స్‌ను తలపిస్తోంది.దక్షిణ ఇటలీలోని బిటోంటో పట్టణానికి చెందిన ఈ మహిళ సూపర్ ఎనలోట్టో లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. కుటుంబంలో కోల్పోయిన ప్రియమైనవారి జ్ఞాపకాలు, పుట్టినరోజుల నంబర్లతో ఆమె రెగ్యులర్‌గా లాటరీ ఆడేది.
ఫలితాలు వచ్చాక తనకు బహుమతి రాలేదని భావించిన ఆమె, ఆ టికెట్‌ను నిర్లక్ష్యంగా చెత్తబుట్టలో పడేసింది. కానీ కొద్దిసేపటికే అసలు నిజం బయటపడింది. ఆ టికెట్‌కు ఏకంగా రూ.11 కోట్లకు పైగా (సుమారు 1 కోటి యూరోలు) బహుమతి తగిలిందని తేలింది. విషయం తెలిసిన వెంటనే ఆమె లాటరీ షాప్‌కు పరుగెత్తింది. కానీ అప్పటికే చెత్త వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.
కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక వ్యర్థాల నిర్వహణ సంస్థను ఆశ్రయించారు. అడ్మినిస్ట్రేటర్ రోబెర్టో నికోలా టోస్కానో నేతృత్వంలో ఆ చెత్త ట్రక్ వెళ్లిన రూట్‌ను ట్రాక్ చేశారు. అదృష్టవశాత్తూ సరైన వాహనాన్ని గుర్తించి వెంటనే నిలిపివేశారు.
అయితే చెత్తలో ప్రమాదకర వ్యర్థాలు ఉండే అవకాశం ఉండటంతో, ప్రత్యేక పరికరాలు ఉన్న సంస్థకు ఆ వాహనాన్ని తరలించారు. మున్సిపల్ అధికారుల సహకారంతో పారిశుద్ధ్య కార్మికులు రెండు రోజుల పాటు శ్రమించి, వ్యర్థాల కుప్పలో టికెట్ కోసం గాలించారు.
చివరకు చెక్కుచెదరకుండా ఉన్న ఆ లాటరీ టికెట్‌ను వెలికితీశారు. టికెట్ చేతికి రాగానే ఆ మహిళ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది.చిన్న నిర్లక్ష్యం వల్ల కోట్లు కోల్పోయే పరిస్థితి వచ్చినా, పారిశుద్ధ్య సిబ్బంది శ్రమ వల్ల ఆమె అదృష్టం మళ్లీ ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.