విజయవాడలో దేవీ నవరాత్రులకు భారీ ఏర్పాట్లు..
విజయవాడ దసరా 2026 వేడుకలకు నగరం సిద్ధమవుతోంది. దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ నగరంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారి నవరాత్రి ఉత్సవాలతో పాటు సరస్సు మేళా, విజయవాడ ఉత్సవ్ వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అక్టోబర్ 8 నుంచి సరస్సు మేళా
దసరా వేడుకల్లో భాగంగా అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు సరస్సు మేళా నిర్వహించనున్నారు. నగరానికి వచ్చే సందర్శకులు, స్థానికులకు ప్రత్యేక అనుభూతి కలిగించేలా మేళాను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నవరాత్రుల సమయంలో విజయవాడకు వచ్చే భక్తులు, పర్యాటకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
అక్టోబర్ 11 నుంచి విజయవాడ ఉత్సవ్
అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ ఉత్సవ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వేదికగా పున్నమి ఘాట్‌ను ఎంపిక చేశారు. విజయవాడ నగర సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
విజయవాడ ఉత్సవ్‌కు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను కూడా ఆహ్వానించే కార్యక్రమం కొనసాగుతోంది. విజయవాడకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల ప్రముఖులను ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించారు.
పున్నమి ఘాట్.. ఎం.బీ.కే. స్టేడియం వేదికలు
నవరాత్రి వేడుకల్లో భాగంగా జరిగే కార్యక్రమాలకు పున్నమి ఘాట్, ఎం.బీ.కే. స్టేడియంలను వేదికలుగా ఉపయోగించనున్నారు. ఆయా ప్రాంతాల్లో కార్యక్రమాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో నిర్వహించే కార్యక్రమాల పూర్తి వివరాలను కర్టెన్ రైజర్ కార్యక్రమంలో వెల్లడించనున్నట్లు మంత్రి తెలిపారు.
దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు కూడా..
మరోవైపు ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు పది రోజుల పాటు దసరా నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 16న మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతి దేవి అలంకారం, అక్టోబర్ 20న విజయదశమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు.
దసరాకు ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి
దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు రాకపోకలు, పార్కింగ్‌పై కూడా దృష్టి సారించారు. ఇప్పటికే ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 22 నుంచి వారం రోజుల పాటు ఘాట్ రోడ్డును వాహనాల రాకపోకలకు మూసివేశారు. భక్తులు శ్రీ కనకదుర్గ నగర్ మార్గం ద్వారా ఆలయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.
హైదరాబాద్, సూర్యాపేట, నందిగామ వైపు నుంచి వచ్చే భక్తుల వాహనాలకు పున్నమి ఘాట్ వద్ద పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఆలయానికి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. విశాఖపట్నం, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వన్‌టౌన్ వైపు వచ్చే భక్తుల కోసం సీతమ్మవారి పాదాల వద్ద పార్కింగ్ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి కూడా ఉచిత బస్సు సదుపాయం కల్పించనున్నారు.
భక్తుల దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు
దసరా సమయంలో సాధారణ భక్తులకు దర్శనం కల్పించేందుకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. సాధారణ దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లను నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఘాట్ రోడ్డుపై అప్రమత్తత
ఇటీవల భారీ వర్షాల కారణంగా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన ఘటన కూడా చోటుచేసుకుంది. అయితే అప్పటికే రాకపోకలు నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. దసరా నవరాత్రుల నేపథ్యంలో ఘాట్ రోడ్డుకు అవసరమైన మరమ్మతులు, రక్షణ చర్యలను వేగంగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.
మొత్తంగా ఈ ఏడాది దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్, సరస్సు మేళా, ఫుడ్ ఫెస్టివల్‌తో నగరంలో దసరా సందడి నెలకొననుంది.
చంద్రబాబుకు బిగ్ షాక్.. మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్
గుడివాడ–హనుమాన్ జంక్షన్ రోడ్డు: నాలుగు వరసలు ఎప్పుడు?