క్యాబినెట్ కీలక నిర్ణయాలు: తల్లికి వందనం రెండో విడతకు ఓకే
తల్లికి వందనం పథకం రెండో విడతకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరిగింది. నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు.
రెండో దశలో ఎంపికైన 3,29,201 మందికి తల్లికి వందనం సాయం విడుదలకు ఆమోదం లభించింది. కొత్తగా 58,601 మందిని చేర్చడంతో మొత్తం లబ్ధిదారులు 68,05,791కి చేరారు. పథకం బడ్జెట్‌ను రూ.10,208.69 కోట్లకు పెంచారు.
హాస్టళ్లు, గురుకులాల విద్యార్థుల డైట్ ఛార్జీలను 10 శాతం పెంచారు. ఈ పెంపు అక్టోబర్ 1 నుంచే అమల్లోకి వచ్చింది. 6,28,409 మంది విద్యార్థులకు ఇది వర్తిస్తుంది.
విధుల్లో ఉండగా మరణించే ఆశా కార్యకర్తల కుటుంబాలకు గ్రాట్యుటీ ఇస్తారు. ప్రతి సర్వీసు ఏడాదికి రూ.5 వేల చొప్పున, గరిష్ఠంగా రూ.1.50 లక్షలు చెల్లిస్తారు. ఇందుకోసం రూ.2.19 కోట్లు మంజూరు చేశారు.
ఇళ్ల స్థలాల సమస్యను 45 రోజుల్లో పరిష్కరించేందుకు మంత్రుల కమిటీ వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. లబ్ధిదారులు వదిలేసిన స్థలాల రిజిస్ట్రేషన్ రద్దు చేసి అర్హులకు ఇవ్వడంపై ఈ కమిటీ నివేదిక ఇస్తుంది. ఆవాస్ సర్వేలో గుర్తించిన 2 లక్షల మందికి భూసేకరణ ఎలా చేయాలో కూడా పరిశీలిస్తుంది.
ఎన్టీఆర్ జిల్లాలో పోరంబోకు భూముల్లో ఏళ్లుగా ఉంటున్నవారికి క్రమబద్ధీకరణ జరగనుంది. ఇందుకు సంబంధించిన జీవో 615, 618లను క్యాబినెట్ ర్యాటిఫై చేసింది. అసైనీలు, వారసులు, కొనుగోలుదారులకు ఇది ఒక్కసారి కల్పించే అవకాశం.
ప్రైవేట్ స్కూళ్ల అనుమతికి ఇప్పటివరకు ఉన్న సర్వే, నోటిఫికేషన్, బడి అవసరం నిరూపణ నిబంధనలను తొలగిస్తారు. ఇందుకోసం విద్యా చట్టం-1982 సవరణకు ఆర్డినెన్స్ తెస్తారు. భద్రత ప్రమాణాల్లో మాత్రం సడలింపు ఉండదని ప్రభుత్వం తెలిపింది.
విదేశీ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో క్యాంపస్‌లు పెట్టేందుకు కొత్త పాలసీ-2026కు ఆమోదం లభించింది. దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉండదని పేర్కొన్నారు.
బాపట్ల జిల్లా రేపల్లెలోని 30 పడకల సీహెచ్‌సీని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా మారుస్తారు. ఇందుకోసం కొత్తగా 66 పోస్టులు మంజూరు చేశారు.
విశాఖ జిల్లా మరికవలస గిరిజన గురుకులంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ 600 మంది గిరిజన ఇంటర్ విద్యార్థులకు ఐఐటీ-జేఈఈ, నీట్ నివాస కోచింగ్ ఇస్తారు. బాలురు, బాలికలకు 300 చొప్పున సీట్లు ఉంటాయి.
ఉద్యాన పంటల సమాచారాన్ని ఒకేచోట నిర్వహించేందుకు ఏపీహెచ్ఐఎంఎస్ వ్యవస్థ రూపొందిస్తారు. దాని బాధ్యతను వస్సార్ ల్యాబ్స్ సంస్థకు అప్పగించారు.
కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం నక్కనపల్లెలో 1.69 ఎకరాల పశువుల మేత భూమిని కడాకు కేటాయించారు. అక్కడ అధికారుల అతిథి గృహం నిర్మిస్తారు.
కడప జిల్లా నందలూరు మండలం పాతూరులో 7.66 ఎకరాల ప్రభుత్వ భూమిని శ్రీ కన్నేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఇస్తారు. రూ.60.20 లక్షల విలువైన ఈ భూమిని దేవాదాయ శాఖకు ఉచితంగా బదలాయిస్తారు.
ప్రకాశం జిల్లా కొండేపిలో 7 ఎకరాల వాగు పోరంబోకు భూమిని బీసీ బాలుర గురుకులం, హాస్టల్ నిర్మాణానికి కేటాయించారు.
ప్రధాని మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రివర్గం అభినందన తీర్మానం చేసింది.
చంద్రబాబుకు బిగ్ షాక్.. మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్
గుడివాడ–హనుమాన్ జంక్షన్ రోడ్డు: నాలుగు వరసలు ఎప్పుడు?