జనసేనను గోదావరికే పరిమితం చేశారా?
కూటమి సీట్ల పంపకం ఖరారైంది. జాబితా చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. జనసేనకు దక్కిన సీట్లలో సగం గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి.
రాష్ట్రంలో 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కలిపి 123 పట్టణ సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ 89 చోట్ల, జనసేన 25, బీజేపీ 9 చోట్ల పోటీ చేస్తున్నాయి.
మొత్తం వార్డుల్లో 40 శాతం కావాలని జనసేన మొదట ప్రతిపాదించింది. చివరకు దక్కింది ఐదో వంతు సంస్థలే.
ఆ 25లో 12 సంస్థలు కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లోనే ఉన్నాయి. పిఠాపురం, గొల్లప్రోలు, తుని, సామర్లకోట, అమలాపురం, ముమ్మిడివరం, నిడదవోలు, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం.. ఇవన్నీ జనసేన ఖాతాలోనే ఉన్నాయి.
రాయలసీమలో పరిస్థితి పూర్తిగా వేరు. కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో జనసేనకు ఒక్క మున్సిపాలిటీ కూడా దక్కలేదు. శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర, పుట్టపర్తి, తిరుపతి జిల్లాలో పుత్తూరు.. సీమలో జనసేనకు వచ్చింది ఇవి మూడే.
తిరుపతి విషయమే చూడండి. అక్కడ ఎమ్మెల్యే జనసేనకు చెందిన ఆరణి శ్రీనివాసులు. అయినా తిరుపతి మేయర్ సీటు జనసేనకు దక్కలేదు. అడిగినా కష్టమని టీడీపీ తేల్చిచెప్పింది.
విశాఖ నగర పరిధిలోనూ జనసేనకు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా జీవీఎంసీని టీడీపీ వదులుకోలేదు.
గోదావరి జిల్లాలు, కాపు ఓటు బ్యాంకు ఉన్న చోట్లకే జనసేనను పరిమితం చేశారన్న చర్చ ఆ పార్టీ శ్రేణుల్లోనే మొదలైంది. రాష్ట్రమంతా విస్తరించాలన్న పవన్ కల్యాణ్ ఆశలకు ఇది గండిగా కొందరు నేతలు భావిస్తున్నారు.
మేయర్ సీట్లలోనూ చివరి నిమిషం వరకు మార్పులు జరిగాయి.
గురువారం సాయంత్రం వరకు ఒంగోలు జనసేనకే అని కూటమి వర్గాలు చెప్పాయి. శుక్రవారం విడుదలైన తుది జాబితాలో ఒంగోలు టీడీపీకి వెళ్లింది. దాని స్థానంలో శ్రీకాకుళం జనసేనకు వచ్చింది.
శ్రీకాకుళం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. అక్కడ జనసేనకు పెద్దగా బలం లేదు. ఒంగోలు కోసం పట్టుబట్టిన జనసేనకు చివరకు శ్రీకాకుళం ఎందుకు ఇచ్చారన్నది ఇప్పుడు కూటమిలోనే చర్చనీయాంశమైంది.
ఇంకో ఆసక్తికర అంశం ఉంది. కొన్ని చోట్ల టీడీపీ ఎమ్మెల్యేల సొంత పట్టణాలే మిత్రపక్షాలకు వెళ్లాయి.
మన ప్రాంతంలో తిరువూరు జనసేనకు దక్కింది. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. ఎంపీ కేశినేని చిన్నితో ఆయనకు ఉన్న విభేదాలు అందరికీ తెలిసినవే. ఇప్పుడు మున్సిపల్ సీటు కూడా చేజారడంతో అక్కడ ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి.
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్యేగా ఉన్న చిలకలూరిపేట, పెడన కూడా జనసేనకు వెళ్లాయి. బాపట్ల బీజేపీకి దక్కింది. ఈ మూడు చోట్లా ఎమ్మెల్యేలు టీడీపీ వాళ్లే.
తెనాలి మాత్రం ఊహించినట్టే జనసేనకు వచ్చింది. అది మంత్రి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గం.
బీజేపీ పరిస్థితి ఇంకా విచిత్రంగా ఉంది. రాజమహేంద్రవరం, అనంతపురం మేయర్ సీట్లతో పాటు ఏడు మున్సిపాలిటీలు దక్కాయి.
కానీ బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట్ల ఆ పార్టీకి సీట్లు రాలేదు. మంత్రి సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గం ధర్మవరం, బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గెలిచిన ఆదోని.. రెండూ టీడీపీకే వెళ్లాయి.
పైగా జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లిమర్ల బీజేపీకి దక్కింది.
ఇలా ఒకరి ఎమ్మెల్యే ఉన్న చోట మరొకరి అభ్యర్థి పోటీ చేస్తే కింది స్థాయిలో సహకారం ఎంతవరకు ఉంటుందన్నదే అసలు ప్రశ్న. కూటమి అభ్యర్థిని ఓడించేందుకు సొంత పార్టీ రెబల్స్ బరిలోకి దిగితే లాభపడేది వైసీపీనే.
నామినేషన్ల గడువు శనివారంతో ముగుస్తుంది. ఎన్ని చోట్ల రెబల్స్ నామినేషన్లు వేస్తారు, అందులో ఎంతమంది ఉపసంహరించుకుంటారు అన్నదానిపైనే కూటమి సమన్వయం ఆధారపడి ఉంది.
బెజవాడ మేయర్ పోరు: రాధా vs భాగ్యలక్ష్మి
జనసేనకు ఆ నాలుగు మేయర్ సీట్లు
రాధా చేరిక వెనుక కూటమి లెక్క