జనసేనకు ఆ నాలుగు మేయర్ సీట్లు
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకం కొలిక్కి వస్తోంది. 17 నగరపాలక సంస్థల్లో జనసేనకు నాలుగు మేయర్ స్థానాలు దక్కనున్నాయి. కాకినాడ, ఏలూరు, విజయవాడ, ఒంగోలు నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని కూటమి వర్గాల సమాచారం.
ఇప్పటివరకు జనసేనకు దక్కే సీట్లలో మచిలీపట్నం పేరు ఖాయంగా వినిపించింది. తాజా జాబితాలో మాత్రం అది లేదు. దాని స్థానంలో ఒంగోలు చేరింది. ఒంగోలు కోసం జనసేన మొదటి నుంచీ పట్టుబడుతూ వచ్చింది.
జనసేన మొత్తం ఆరు కార్పొరేషన్లు, 26 మున్సిపాలిటీలు కోరింది. తిరుపతి మేయర్ సీటు కూడా అడిగింది. అది కష్టమని టీడీపీ నేతలు స్పష్టం చేసినట్టు తెలిసింది.
మున్సిపాలిటీల్లో జనసేనకు 20 నుంచి 24 వరకు దక్కే అవకాశం ఉంది. పిఠాపురం, తెనాలి, జగ్గయ్యపేట, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, సత్తెనపల్లి, నరసరావుపేట, రేపల్లె, పొన్నూరు లాంటి పేర్లు చర్చలో ఉన్నాయి.
బీజేపీకి ఒక మేయర్, పది మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆ ఒక్క మేయర్ సీటుపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది.
మొదట బీజేపీ విశాఖ, నెల్లూరు, తిరుపతి అడిగింది. ఇప్పుడు రాజమహేంద్రవరం కావాలని పట్టుబడుతోంది. అక్కడ ఆ పార్టీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఉండటం ఇందుకు ఒక కారణం.
రాజమహేంద్రవరం మేయర్ పదవి ఈసారి ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయింది. 2021లో అక్కడ కార్పొరేషన్ ఎన్నికలే జరగలేదు. ఈసారి ఆ సీటు ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తిగా మారింది.
మిగిలిన కార్పొరేషన్లలో టీడీపీ పోటీ చేయనుంది. విశాఖ, గుంటూరు లాంటి పెద్ద నగరాలు టీడీపీ వద్దే ఉంటాయి.
విజయవాడ సీటు జనసేనకు వెళ్లడం వెనుక వంగవీటి రాధా చేరిక కీలకమైంది. బుధవారమే ఆయన పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. రాధా లేదా ఆయన కుటుంబ సభ్యులు మేయర్ బరిలో ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.
అయితే విజయవాడ మేయర్ సీటు కోసం టీడీపీలోనూ 15 మందికి పైగా పోటీ పడ్డారు. సీటు జనసేనకు వెళ్తే వాళ్లను బుజ్జగించడం టీడీపీకి పెద్ద పనే.
ఉమ్మడి అభ్యర్థుల జాబితాను రెండు రోజుల్లో ప్రకటిస్తామని జనసేన ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ యాదవ్ తెలిపారు. నామినేషన్ల గడువు ఈ నెల 18తో ముగుస్తుంది. 28న పోలింగ్, 30న ఫలితాలు.
బెజవాడ మేయర్ పోరు: రాధా vs భాగ్యలక్ష్మి
జనసేనను గోదావరికే పరిమితం చేశారా?
రాధా చేరిక వెనుక కూటమి లెక్క