మున్సిపల్తు పోరుకు తుఫాను గండం
ఒక వాయిదా తర్వాత మున్సిపల్ ఎన్నికలు నవంబర్ 1కి ఖరారయ్యాయి. కానీ పోలింగ్‌కు సరిగ్గా నాలుగు రోజుల ముందు రాష్ట్రాన్ని తుఫాను తాకనుంది. ఇప్పుడు ఉత్తర కోస్తాలోని పట్టణాల్లో అభ్యర్థులను, అధికారులను ఒకటే ప్రశ్న వెంటాడుతోంది. ఈ తుఫాను మధ్య ఎన్నికలు సజావుగా జరుగుతాయా?
తేదీలు ఒకదానిపై ఒకటి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారానికి తుఫానుగా బలపడనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. 28న ఉత్తర కోస్తాలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక ఎన్నికల షెడ్యూల్ చూస్తే, 25న తుది అభ్యర్థుల జాబితా వస్తుంది. ఆ వెంటనే ప్రచారం జోరందుకోవాలి. సరిగ్గా అదే సమయంలో 27 నుంచి వర్షాలు మొదలవుతాయి. 28న భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చు. నవంబర్ 1న పోలింగ్ ఉంది.
అంటే ప్రచారానికి ఉన్న కీలకమైన రోజులన్నీ తుఫాను చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి.
ఈ జిల్లాల పట్టణాలకే ఎక్కువ ముప్పు
శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియపై తుఫాను నీడ పడనుంది.
తుఫాను సమయంలో గంటకు 55 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా.
ప్రచారం ఎలా?
అభ్యర్థులకు ఇదే పెద్ద తలనొప్పి. తుది జాబితా వచ్చాక ప్రచారానికి మిగిలేది కొద్ది రోజులే. అందులోనూ రెండు మూడు రోజులు వర్షాలకే పోతే ఇంటింటికీ ఎలా వెళ్లాలి? ర్యాలీలు, సభలు ఎలా పెట్టాలి?
పెద్ద పార్టీలకు సోషల్ మీడియా ప్రచారం ఉంది. కానీ వార్డు స్థాయిలో పోటీ చేసే స్వతంత్రులు, చిన్న అభ్యర్థులకు ఇంటింటి ప్రచారమే ఆధారం. వర్షం వాళ్లకే ఎక్కువ దెబ్బ.
యంత్రాంగంపై డబుల్ భారం
మరోవైపు అధికారుల పరిస్థితీ అంతే. ఎన్నికల సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం అంతా ఎన్నికల పనుల్లో ఉంటారు. అదే సమయంలో తుఫాను సహాయ చర్యలు కూడా వీళ్లే చూడాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించడం, పునరావాస కేంద్రాలు నడపడం, విద్యుత్, తాగునీరు పునరుద్ధరించడం అంతా వీళ్ల బాధ్యతే.
ఇంకో సమస్య పోలింగ్ కేంద్రాలు. చాలా పోలింగ్ కేంద్రాలు పాఠశాల భవనాల్లోనే ఉంటాయి. తుఫాను సమయంలో ఇవే పునరావాస కేంద్రాలుగా మారతాయి. పోలింగ్ నాటికి వాటిని ఖాళీ చేసి సిద్ధం చేయాలి. లోతట్టు వార్డుల్లో నీరు నిలిస్తే ఓటర్లు బయటకు రావడమూ కష్టమే.
గతేడాది అనుభవం
సరిగ్గా ఏడాది క్రితం మొంథా తుఫాను కూడా ఇవే రోజుల్లో వచ్చింది. 29 అర్ధరాత్రి నరసాపురం దగ్గర తీరం దాటింది. అప్పుడు రాష్ట్రంలో 38 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి ఈసారి ఎన్నికల వారంలోనే వస్తే ఏంటన్నదే ఇప్పుడు ఆందోళన.
ఎస్ఈసీ ముందున్న సవాల్
ఇప్పటికే నామినేషన్ల వివాదంతో ఒకసారి షెడ్యూల్ మారింది. 27న సుప్రీంకోర్టులో విచారణ కూడా ఉంది. ఇప్పుడు తుఫాను మూడో సవాల్‌గా మారింది. పోలింగ్ రోజు ఎక్కడైనా సమస్య వస్తే 2న రీపోలింగ్‌కు అవకాశం ఉంది. కానీ తుఫాను నష్టం ఎక్కువగా ఉంటే అది సరిపోతుందా అన్నది ప్రశ్న.
తుఫాను దిశ, తీవ్రతపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. తీరానికి దగ్గరయ్యే కొద్దీ లెక్క తేలుతుంది. ఆ తర్వాతే ఉత్తర కోస్తా పట్టణాల్లో ఎన్నికలపై ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
కోర మీసం… ఇప్పుడు టాలీవుడ్ మాస్ మంత్రం
మున్సిపల్ నుంచి పరిషత్ దాకా అదే రగడ
ఏపీకి తుఫాను ముప్పు… 28న తీరం దాటే అవకాశం