రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా విజయవాడ పటమట పోలీసులు, సిటీ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)ని ఆశ్రయించారు. తన చిన్ననాటి స్నేహితుడు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ సిటిజన్ తాతినేని రామ్ బాబు (59) పై పోలీసులు సాగిస్తున్న అక్రమ నిర్బంధం, శారీరక, మానసిక వేధింపులపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆయన ఢిల్లీలోని ఎన్హెచ్ఆర్సీ చైర్‌పర్సన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
లేఖలో పేర్కొన్న ముఖ్యమైన అంశాలు, ఆరోపణల వివరాలు ఇలా ఉన్నాయి:
రాజకీయ కక్షసాధింపుతో తప్పుడు కేసు
రాజకీయ ప్రత్యర్థులను మానసికంగా, శారీరకంగా వేధించాలనే ఉద్దేశంతోనే పటమట పోలీస్ స్టేషన్లో రామ్ బాబుపై క్రైమ్ నెం. 225/2026 (తేది: 04.06.2026) కింద పూర్తిగా కల్పితమైన, తప్పుడు కేసు నమోదు చేశారని కేశినేని నాని ఆరోపించారు.
అర్ధరాత్రి ఇళ్లపై పడి బెదిరింపులు
ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి ఒక రోజు ముందే (03.06.2026 రాత్రి 11:30 గంటలకు) సిటీ టాస్క్‌ఫోర్స్ సబ్-ఇన్స్పెక్టర్ (SI) నవీన్, పటమట పరిధిలో తనకు ఎటువంటి అధికార పరిధి లేకపోయినప్పటికీ రామ్ బాబు నివాసంలోకి అక్రమంగా చొరబడ్డారు. ఇంట్లో రామ్ బాబు లేకపోవడంతో, ఆయన వృద్ధురాలైన తల్లిని తీవ్రంగా బెదిరించి, మానసిక ఆందోళనకు గురిచేశారని పేర్కొన్నారు.
అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని 11 గంటల పాటు అక్రమ నిర్బంధం
ఇటీవలే గుండె జబ్బుకు శస్త్రచికిత్స చేయించుకుని, జూన్ 1వ తేదీన కంటికి తీవ్రమైన క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్న రామ్ బాబును కేవలం ఒక ఫోన్ కాల్ ఆధారంగా జూన్ 5న మధ్యాహ్నం 12:30 గంటలకు పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. సాక్షిగా విచారించాలనే నెపంతో, ఎలాంటి వైద్య సదుపాయాలు లేని గదిలో రాత్రి 11:30 గంటల వరకు (నిరంతరాయంగా 11 గంటల పాటు) అక్రమంగా నిర్బంధించి మానసిక క్షోభకు గురిచేశారని లేఖలో వివరించారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఉల్లంఘన
భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 352, 353(2) కింద నమోదైన కేసులకు మూడేళ్లలోపు మాత్రమే శిక్ష ఉంటుందని, సుప్రీంకోర్టు ల్యాండ్‌మార్క్ తీర్పు ‘అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్’ ప్రకారం 7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో సెక్షన్ 41 CrPC (సెక్షన్ 35 BNSS) కింద నోటీసు ఇవ్వడం తప్పనిసరని గుర్తుచేశారు. కానీ పోలీసులు చట్టపరమైన రక్షణలను దాటвеస్తూ, బలవంతపు విచారణ కోసం సెక్షన్ 179 BNSS కింద సాక్షి నోటీసు ఇచ్చి చట్టాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.
ప్రైవసీ హక్కుకు భంగం.. నిరంతర వేధింపులు
సుప్రీంకోర్టు ఇచ్చిన ‘కె.ఎస్. పుట్టస్వామి’ ప్రైవసీ తీర్పుకు విరుద్ధంగా రామ్ బాబు వ్యక్తిగత ఫోన్, క్రెడెన్షియల్స్ ఇవ్వాలని పోలీసులు బలవంతం చేస్తున్నారని, జూన్ 5న ప్రయాణంలో ఫోన్ పోయిందని లిఖితపూర్వకంగా తెలిపినప్పటికీ వినకుండా.. జూన్ 6, 7, 8 తేదీల్లో వరుసగా స్టేషన్‌కు హాజరుకావాలంటూ మానసిక ఒత్తిడి తెస్తున్నారని, దీనివల్ల ఆయన కంటి చూపుకు, ప్రాణానికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
మానవ హక్కుల కమిషన్‌కు కేశినేని నాని విన్నపం (Prayer for Relief):
వివరణ కోరాలి: అక్రమంగా 11 గంటల పాటు వృద్ధుడిని నిర్బంధించిన అంశంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ (DGP), విజయవాడ పోలీస్ కమిషనర్ల నుంచి తక్షణమే నివేదిక కోరాలి.
ఇండిపెండెంట్ విచారణ: వృద్ధురాలిని బెదిరించి, ఇళ్లలోకి అక్రమంగా చొరబడిన సిటీ టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ నవీన్‌పై స్వతంత్ర మానవ హక్కుల విచారణకు ఆదేశించాలి.
రక్షణ కల్పించాలి: తీవ్రమైన గుండె, కంటి సమస్యల నుంచి కోలుకోవడానికి రామ్ బాబుకు వైద్యుల సూచనల మేరకు కనీసం 15 రోజుల సమయం ఇచ్చేలా, పోలీసుల వేధింపులను తక్షణమే నిలిపివేసేలా రక్షణ ఉత్తర్వులు జారీ చేయాలని కేశినేని నాని ఎన్హెచ్ఆర్సీని డిమాండ్ చేశారు.