ఏపీ నుంచి ఎన్డీఏ కూటమి తరఫున ఎన్నికైన నలుగురు రాజ్యసభ ఎంపీల్లో అందరినీ ఆకర్షించిన పేరు లింగమనేని రమేష్. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేనకు కేటాయించిన ఏకైక రాజ్యసభ స్థానానికి ఆయన ఎన్నికయ్యారు. జనసేన నుంచి రాజ్యసభలో అడుగుపెడుతున్న తొలి వ్యక్తి ఆయనే. ఒక కార్పొరేట్ పారిశ్రామికవేత్తకు పవన్ కళ్యాణ్ అత్యున్నత సభ స్థానాన్ని కేటాయించడం వెనుక ఉన్న ఆసక్తికర సమీకరణాలు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
2019 గడ్డుకాలంలో నిలబడ్డ స్నేహం
రాజకీయాల్లో గెలిచినప్పుడు వందల మంది తోడొస్తారు.. కానీ ఓడినప్పుడు నిలబడేవారే అసలైన నమ్మకస్తులు. 2019 ఎన్నికల్లో జనసేన కేవలం ఒకే ఒక్క సీటు గెలిచి, పవన్ కళ్యాణ్ స్వయంగా రెండు చోట్లా ఓడిపోయినప్పుడు చాలా మంది పారిశ్రామికవేత్తలు, కీలక నేతలు పార్టీకి దూరమయ్యారు. ఆ గడ్డు కాలంలో కూడా లింగమనేని రమేష్ పవన్ వెంటే నడిచారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయ నిర్వహణ నుండి, పార్టీ అంతర్గత వ్యూహాలు, 2024 ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్ల వరకు తెరవెనుక ఉండి ఆర్థికంగా, నైతికంగా గట్టి అండగా నిలిచారు. ఈ విధేయతకు దక్కిన గౌరవంగానే పవన్ కళ్యాణ్ ఈ సీటును కేటాయించినట్లు తెలుస్తోంది.
విజయవాడ ‘రియల్ ఎస్టేట్’ రూపుమార్చిన లీడర్
లింగమనేని ఎస్టేట్స్ (ప్రస్తుతం LEPL ప్రాజెక్ట్స్) సంస్థను ఆయన తండ్రి ఎల్.పి. భాస్కరరావు 1983లో స్థాపించినప్పటికీ, రమేష్ బాధ్యతలు చేపట్టాక దీనిని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లారు. మలేషియాకు చెందిన ప్రపంచ స్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం ‘IJM కార్పొరేషన్’తో జాయింట్ వెంచర్ కుదుర్చుకుని, కోస్తా ఆంధ్రాలోనే మొట్టమొదటి అంతర్జాతీయ ప్రమాణాలు గల మెగా టౌన్‌షిప్ “రైన్ ట్రీ పార్క్”ను గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిపై నిర్మించారు. విజయవాడ నడిబొడ్డున మల్టీప్లెక్స్, గ్లోబల్ బ్రాండ్ల సంస్కృతిని (LEPL ఐకాన్, సెంట్రో ద్వారా) పరిచయం చేయడంలో ఆయన వ్యూహం కీలక పాత్ర పోషించింది.
‘ఎయిర్ కోస్టా’ సాహసం
లింగమనేని రమేష్ వ్యాపార ప్రస్థానంలో అత్యంత సాహసోపేతమైన అడుగు ‘ఎయిర్ కోస్టా’ విమానయాన సంస్థ స్థాపన. 2013లో విజయవాడ కేంద్రంగా రీజినల్ ఎయిర్‌లైన్స్‌గా ఇది ప్రారంభమైంది. టైర్-2, టైర్-3 నగరాలను అనుసంధానిస్తూ బ్రెజిల్ దేశానికి చెందిన ‘ఎంబ్రేయర్’ విమానాలతో సర్వీసులు నడిపారు. ఒకానొక దశలో దేశంలోనే అత్యంత విజయవంతమైన ప్రాంతీయ విమానయాన సంస్థగా నిలిచినప్పటికీ, అంతర్జాతీయంగా ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ ఖర్చులు, ఆర్థిక వివాదాల వల్ల 2017లో ఈ సర్వీసులు నిలిచిపోయాయి. అయినప్పటికీ నవ్యాంధ్ర నుండి ఒక సొంత ఎయిర్‌లైన్స్ నడపవచ్చని నిరూపించిన పారిశ్రామిక ధీశాలి ఆయన.
కరకట్ట నివాసం.. రాజకీయ రగడ
రాజకీయ వర్గాల్లో లింగమనేని రమేష్ పేరు గత కొన్నేళ్లుగా ఎక్కువగా వినబడటానికి కృష్ణానది కరకట్టపై ఉన్న ఆయన గెస్ట్ హౌస్ ప్రధాన కారణం. గత పదేళ్లుగా నారా చంద్రబాబు నాయుడు ఈ నివాసంలోనే ఉంటున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ భవనం నదీ పరివాహక నిబంధనలను ఉల్లంఘించి కట్టారంటూ కూల్చివేత నోటీసులు ఇవ్వడం పెద్ద సంచలనంగా మారింది. రాజకీయంగా ఎంత ఒత్తిడి వచ్చినా చంద్రబాబుకు అండగా నిలబడటం ఆయన నమ్మకానికి నిదర్శనం. వ్యాపారంలో ఎయిర్ కోస్టా వంటి ఎదురుదెబ్బలు తగిలినా, రాజకీయాల్లో తీవ్ర ఒత్తిళ్లు ఎదురైనా ఎంచుకున్న నమ్మకానికి కట్టుబడి ఉండటమే ఈరోజు ఆయనను ఎగువ సభకు అర్హుడిని చేసింది.