స్థానిక ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని రాజకీయ పారీల్లో చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. దానికి ఇప్పుడు సమాధానం దొరికింది. సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్‌లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా పార్టీ శ్రేణులకు చెప్పారు.
అసలు ఆలస్యం ఎందుకంటె?
ఒకే ఒక్క కారణం–ఎస్ఐఆర్.. అంటే ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ. ఈ ప్రక్రియ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నడుస్తోంది. సెప్టెంబర్ నాటికి ఇది పూర్తవుతుంది. సర్ పూర్తయిన వెంటనే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని టీడీపీ నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు స్పష్టం చేశారు.
ముందుగా మున్సిపల్ ఎన్నికలే!
ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఎన్నికలు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలుత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
అంటే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం వంటి కార్పొరేషన్లే తొలి యుద్ధభూమి కానున్నాయి. విజయవాడ మేయర్ పదవి ఈ ఏడాది మార్చి నుంచి ఖాళీగానే ఉంది. కొత్త మేయర్ ఎవరనేది ఈ ఎన్నికలతోనే తేలుతుంది.
కూటమిలో లెక్కలు షురూ
జూలై 15న కూటమి పార్టీల రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ.. మూడు పార్టీలూ కలిసే పోటీ చేయాలన్నది ప్రాథమిక నిర్ణయం. జోనల్, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లోనూ సమన్వయ సమావేశాలు జరగాలని సీఎం సూచించారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల పంపకం అసెంబ్లీ స్థాయిలో జరిగింది. ఇప్పుడు వార్డు స్థాయిలో జరగాలి. విజయవాడలో ఏ వార్డు ఎవరిది? గుంటూరులో జనసేనకు ఎన్ని? ఈ లెక్కలే రాబోయే వారాల్లో కూటమిలో అసలు చర్చ. క్షేత్రస్థాయిలో మూడు పార్టీల కార్యకర్తల మధ్య పొత్తు ఎంత సజావుగా సాగుతుందనేది కూడా చూడాల్సిన అంశమే.
వైసీపీ వ్యూహం ఏమిటి?
ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి ఇవి కీలక ఎన్నికలు. సార్వత్రిక ఓటమి తర్వాత క్యాడర్‌ను తిరిగి క్రియాశీలం చేసేందుకు ఇదే తొలి అవకాశం. గత స్థానిక ఎన్నికల్లో (2021) వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి అధికారం లేకుండా ఎంతవరకూ ఫలితాలు సాధిస్తుందోననే ఆసక్తి నెలకొంది.
ఇప్పుడు ఏం జరుగుతుంది
ప్రస్తుతం సర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇది సెప్టెంబర్‌కి పూర్తయ్యాక ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. రిజర్వేషన్ల ఖరారు, వార్డుల విభజన లాంటి ప్రక్రియలు కూడా అంతకుముందే పూర్తి కావాలి. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.