వార్తలు & సమాచార హబ్  |  అమరావతి · విజయవాడ · గుంటూరు
Tuesday, July 28, 2026
విజయవాడ  38°C ☀️
రాజకీయం

వైరల్ నేత అభిజిత్ దీప్కే.. కాక్రోచ్ వెనుక కథేంటి?

📅 July 26, 2026 ✍ News Desk ⏱ 0 నిమిషాల చదువు
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రొఫైల్

కీటకం పేరుతో ఓ ఉద్యమం

దీప్కే బయోగ్రఫీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాక్రోచ్ (బొద్దింక) అనే మాటే రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారడం వెనుక ఉన్న వ్యక్తి అభిజిత్ దీప్కే.. కేవలం రెండు నెలల్లోనే కేంద్ర మంత్రి పదవిని కదిలించే స్థాయికి ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లిన 30 ఏళ్ల యువకుడు ఇతనే.

మే 16న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నిరుద్యోగ యువతను “బొద్దింకలు” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యపై సోషల్ మీడియాలో మంటలు రేగగా, దీప్కే ఒక్క ప్రశ్న వేశారు — “అన్ని బొద్దింకలు ఏకమైతే?” అంతే.. ఆ ఒక్క పోస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)గా మారిపోయింది.

నేపథ్యం, చదువు

దీప్కే మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగారు. మొగలుల చరిత్రకు నిలయమైన, అయితే మౌలిక వసతుల సమస్యలతో సతమతమయ్యే ఆ నగరంలో పెరగడం.. పాలనా వైఫల్యాలు సామాన్యుడిపై ఎలా ప్రభావం చూపిస్తాయో చిన్నప్పటి నుంచే ఆయనకు అర్థమయ్యేలా చేసింది.

పుణెలో జర్నలిజం డిగ్రీ పూర్తి చేసిన దీప్కే, ఆ తర్వాత అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ చేశారు. ఇది అమెరికాలోని అత్యుత్తమ కమ్యూనికేషన్ స్కూళ్లలో ఒకటి. అక్కడ డిజిటల్ క్యాంపెయినింగ్, నెరేటివ్ బిల్డింగ్ మెళకువలు నేర్చుకున్నారు — ఇవే తర్వాత సీజేపీని దేశంలోనే వేగంగా ఎదిగిన రాజకీయ వ్యంగ్య ఉద్యమంగా మార్చడంలో కీలకపాత్ర పోషించాయి.

ఆమ్ ఆద్మీ పార్టీతో గత అనుబంధం

సీజేపీ పెట్టడానికి ముందు దీప్కే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోషల్ మీడియా వాలంటీర్‌గా పనిచేశారు. యువ పార్టీ ఒకటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఎలా ఉపయోగించుకుని పెద్ద పార్టీలతో పోటీపడగలదో నేరుగా అక్కడే నేర్చుకున్నారు. ఈ నేపథ్యం బయటకు రావడంతో సీజేపీ నిజంగా స్వతంత్ర ఉద్యమమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే సీజేపీకి, ఏ పార్టీకి అధికారిక సంబంధం లేదని దీప్కే స్పష్టం చేశారు.

సామర్థ్యాలు

కమ్యూనికేషన్, నెరేటివ్ బిల్డింగ్‌లో అకడమిక్ ప్రావీణ్యం దీప్కే ప్రధాన బలం. కేవలం వారంలోపే 0 నుంచి 2 కోట్ల ఫాలోవర్లకు చేరుకున్న సోషల్ మీడియా వ్యూహం ఇన్‌స్టాగ్రామ్‌లో బీజేపీ అధికారిక ఖాతా ఫాలోవర్లను కూడా దాటేసింది. నిరుద్యోగ యువత ఆవేదనను ఒక్క వ్యంగ్య పదంతో రాజకీయ శక్తిగా మార్చగలిగిన సృజనాత్మకత, ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొని 49 రోజుల నిరసనను ఫలప్రదంగా ముగించగలిగిన నాయకత్వ లక్షణం ఆయనకున్న అదనపు బలాలు.

బలహీనతలు

గతంలో ఆప్‌తో సంబంధాలు ఉండటం వల్ల స్వతంత్రతపై ప్రశ్నలు వస్తున్నాయి. 2019లో కశ్మీర్ అంశంపై రెచ్చగొట్టే పోస్టులు చేశారంటూ లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ నుంచి ఫిర్యాదు నేపథ్యం కూడా ఉంది. అధికారిక పార్టీగా ఎన్నికల సంఘం వద్ద నమోదు లేకపోవడం.. ఇది కేవలం ఆన్‌లైన్ వ్యంగ్య ఉద్యమమే, ఎన్నికల్లో పోటీ చేసే స్థాయి ఇంకా లేదు. ప్రస్తుతం ఉద్యోగం కోసం చూస్తున్నానని స్వయంగా చెప్పుకోవడం దీర్ఘకాలిక రాజకీయ ప్రణాళిక ఉందా అనే సందేహాన్ని లేవనెత్తుతోంది.

భవిష్యత్తు ఏంటి?

ప్రభుత్వంతో చర్చల అనంతరం ఎఫ్‌ఐఆర్‌ల ఎత్తివేత, పరిహారం వంటి డిమాండ్లు నెరవేరడంతో సీజేపీ తన 49 రోజుల జంతర్ మంతర్ నిరసనను విరమించుకుంది. అయితే ఇది కేవలం తాత్కాలిక విజయమా, లేక దీర్ఘకాలిక రాజకీయ శక్తిగా ఎదుగుతుందా అన్నదే అసలు ప్రశ్న. ఎన్నికల సంఘం వద్ద అధికారికంగా నమోదు చేసుకుని, నిజమైన రాజకీయ పార్టీగా మారాలా, లేక కేవలం ఒక సోషల్ మీడియా ఉద్యమంగానే ఆగిపోతుందా అన్నది దీప్కే తీసుకునే తదుపరి నిర్ణయాలపైనే ఆధారపడి ఉంది.

ఒక్కటి మాత్రం నిజం సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఏళ్ల తరబడి కష్టపడి సాధించే ఫాలోయింగ్‌ను, దీప్కే కేవలం ఒక్క పోస్ట్‌తో వారంలో సాధించి చూపించారు.

ఇంతకీ ఈ ఉద్యమం ఎలా మొదలైంది, జడ్జి ఏమన్నారు, ఎవరెవరు మద్దతిచ్చారో పూర్తిగా తెలుసుకోవాలంటే ఇక్కడ చదవండి [సూర్యకాంత్ కామెంట్‌తో పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ]

🔗 ఈ వార్తను షేర్ చేయండి
📰 సంబంధిత వార్తలు
📰 తాజా వార్తలు
📢 Advertisement
300×250
Google AdSense