నామినేషన్లు వేసిన ముగ్గురు టీడీపీ అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన తెలుగుదేశం పార్టీ (TDP) అభ్యర్థులు సోమవారం తమ నామినేషన్లను అధికారికంగా దాఖలు చేశారు. కూటమి తరపున ఖరారైన అభ్యర్థులు సానా సతీష్, బాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు అమరావతిలోని అసెంబ్లీ భవనంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్. వనితా రాణికి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ నామినేషన్ల దాఖలు ప్రక్రియలో కూటమి భాగస్వామ్య పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని, అభ్యర్థులను ప్రతిపాదిస్తూ సంతకాలు చేశారు.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా సానా సతీష్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించగా.. ఆయనను ప్రతిపాదిస్తూ ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, సీనియర్ ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, పంతం వెంకటేశ్వరరావు (నానాజి), తంగిరాల సౌమ్య సంతకాలు చేశారు. అలాగే మరో అభ్యర్థి బాష్యం రామకృష్ణ దాఖలు చేసిన రెండు సెట్ల నామినేషన్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు బి. రామాంజనేయులు, కొలిశెట్టి శ్రీనివాస్, శ్రీరాం తాతయ్యలు సంతకాలు చేశారు. ఇక టీడీపీ తరపున మూడో అభ్యర్థిగా చింతకాయల విజయ్ సమర్పించిన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, సుందరపు విజయ్ కుమార్, బోడే ప్రసాద్ లు ప్రతిపాదించారు.
అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎం. అఖిల్ కుమార్, పి. విజయ కుమారి పర్యవేక్షణలో సాగిన ఈ కార్యక్రమంలో కూటమి నేతలు జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ), వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు), వరుపుల సత్యప్రభ, బండారు సత్యానంద రావుతో పాటు 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ తదితరులు పాల్గొని అభ్యర్థులకు అభినందనలు తెలిపారు.