వార్తలు & సమాచార హబ్  |  అమరావతి · విజయవాడ · గుంటూరు
Sunday, August 30, 2026
విజయవాడ  38°C ☀️
అంతర్జాతీయం

ఒక్క కోర్టు తీర్పు… స్పెయిన్‌లోకి 40 వేల మంది జొరబాటు!

📅 July 31, 2026 ✍ News Desk ⏱ 0 నిమిషాల చదువు
స్పెయిన్ సియుటా సరిహద్దు వద్ద అక్రమ వలసదారుల గుంపులు

స్పెయిన్‌కు చెందిన ఉత్తర ఆఫ్రికా భూభాగం సియుటాలో వలసదారుల సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. మొరాకో నుంచి వేలాది మంది వలసదారులు సముద్రం, భూమార్గం ద్వారా సరిహద్దు దాటి స్పెయిన్ భూభాగంలోకి ప్రవేశించారు. అధికారిక అంచనాల ప్రకారం, కేవలం 24 గంటల్లోనే 49 వేల మందికిపైగా అక్రమంగా సరిహద్దు దాటినట్లు వెల్లడైంది. దీంతో సియుటాలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి.

ఈ భారీ వలసల ప్రవాహంలో కనీసం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు ఫ్లోటేషన్ పరికరాల సహాయంతో సముద్రాన్ని ఈదుకుంటూ సియుటాకు చేరుకునే ప్రయత్నం చేయగా, మరికొందరు తీర ప్రాంతాల గుండా నడుచుకుంటూ వచ్చారు. ఇంకొందరు సరిహద్దు కంచెను బలవంతంగా దాటి స్పెయిన్ భూభాగంలోకి ప్రవేశించారు.

పరిస్థితి అదుపు తప్పడంతో స్పెయిన్ ప్రభుత్వం వెంటనే సియుటాకు సైన్యాన్ని మోహరించింది. సివిల్ గార్డు బలగాలతో కలిసి సైన్యం సరిహద్దు భద్రతను పటిష్టం చేస్తుండగా, అక్రమంగా ప్రవేశించిన వారిని తిరిగి పంపించే చర్యలపై మొరాకోతో సమన్వయం కొనసాగుతోంది.

ఈ పరిణామాలకు ఇటీవల స్పెయిన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. సియుటా లేదా మెలిల్లాకు చేరుకునే ప్రయత్నంలో సముద్రంలో పట్టుబడిన వలసదారులను వెంటనే మొరాకోకు తిరిగి పంపకూడదని కోర్టు ఆదేశించడంతో, వలసల ప్రవాహం క్రమంగా పెరిగి ప్రస్తుతం భారీ స్థాయికి చేరుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ సంక్షోభం ప్రభావం స్పెయిన్‌కే పరిమితం కాలేదు. ఫ్రాన్స్ కూడా అప్రమత్తమై స్పెయిన్‌తో ఉన్న సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో స్పెయిన్ ప్రధానమంత్రి స్వయంగా సియుటాను సందర్శించి పరిస్థితిని సమీక్షించనున్నారు. వేలాది మంది తాత్కాలికంగా ఆశ్రయం పొందిన నేపథ్యంలో వారికి ఆహారం, వసతి వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

స్పెయిన్, ఇటలీ, గ్రీస్ దేశాలు చాలా కాలంగా ఐరోపాలోకి అక్రమ వలసలకు ప్రధాన ప్రవేశ ద్వారాలుగా ఉన్నాయి. ఇటీవల స్పెయిన్ ప్రభుత్వం పత్రాలు లేని లక్షలాది మంది వలసదారులకు చట్టబద్ధత కల్పించే చర్యలు చేపట్టినా, ఇంకా పెద్ద సంఖ్యలో అనధికారిక వలసదారులు దేశంలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సియుటాలో తాజా పరిణామం స్పెయిన్ వలస విధానంపై మరింత ఒత్తిడిని పెంచుతుండగా, మొరాకో నుంచి వలసల ప్రవాహం కొనసాగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

🔗 ఈ వార్తను షేర్ చేయండి
📰 సంబంధిత వార్తలు
📰 తాజా వార్తలు
📢 Advertisement
300×250
Google AdSense