నాని అభిమానులు ఎదురుచూస్తున్న Nani The Paradise విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. సెప్టెంబర్ 24న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో గత రెండు రోజులుగా వినిపిస్తున్న వాయిదా ప్రచారానికి తెరపడింది.
సెప్టెంబర్ 24న ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే విడుదల తేదీ దగ్గరపడుతున్నా సినిమా పనులు పూర్తికాకపోవడంతో వాయిదా పడొచ్చనే వార్తలు బయటకు వచ్చాయి. దీంతో నాని అభిమానుల్లోనూ ఒకింత టెన్షన్ మొదలైంది.
ఇక సినిమా అక్టోబర్‌కు వెళ్లొచ్చంటూ ప్రచారం జరగడంతో అసలు ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే మేకర్స్ మాత్రం ఈ ఊహాగానాలకు చెక్ పెట్టారు. సెప్టెంబర్ 24నే ‘ది ప్యారడైజ్’ థియేటర్లలోకి వస్తుందని మరోసారి ప్రకటించారు.
సినిమా నిర్మాణంలో కీలకమైన పనులు ఇంకా కొనసాగుతున్నాయన్న సమాచారమే ఈ ప్రచారానికి కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా భారీ యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించిన పనులు పూర్తి చేయాల్సి ఉందన్న వార్తలు వచ్చాయి. ఇలాంటి భారీ చిత్రాల్లో చివరి దశలో పనులు ఆలస్యమైతే విడుదల తేదీపై అనుమానాలు రావడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి మాత్రం చిత్రబృందం ముందుగానే స్పందించి డేట్ విషయంలో స్పష్టత ఇచ్చింది.
‘దసరా’ సినిమాతో నాని కెరీర్లో మరో మాస్ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఇప్పుడు వీరిద్దరూ ‘ది ప్యారడైజ్’ కోసం మరోసారి చేతులు కలిపారు. అయితే ‘దసరా’కు భిన్నంగా ఈసారి కథ, నేపథ్యం మరింత భారీగా ఉండబోతున్నట్లు ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు చెబుతున్నాయి. నాని కూడా తన కెరీర్లో ఇంతకు ముందు కనిపించని రీతిలో ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది. సినిమాలో ఆయన పోషిస్తున్న జాదల్ పాత్ర ఎలా ఉంటుంది? అతని ప్రపంచం ఏంటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘యేశనగుల’ పాటలోని ప్రత్యేకమైన నేపథ్యం, విజువల్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. నాని సినిమాకు అనిరుధ్ సంగీతం మరో ఆకర్షణగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాలో కాయదు లోహర్ కథానాయికగా నటిస్తున్నారు. రాఘవ్ జుయాల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మోహన్‌బాబు, సోనాలి కులకర్ణి, తనికెళ్ల భరణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు కీర్తి సురేశ్ కూడా ఈ సినిమాలో ప్రత్యేకంగా కనిపించనున్నారు. దీంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
‘ది ప్యారడైజ్’కు విడుదల తేదీ మారడం ఇదే మొదటిసారి కాదు. తొలుత మార్చి 26న సినిమాను విడుదల చేయాలని భావించారు. ఆ తర్వాత ఆగస్టు 21కి మార్చారు. చివరకు సెప్టెంబర్ 24ను ఖరారు చేశారు. ఇప్పుడు మరోసారి తేదీ మారుతుందన్న ప్రచారం రావడంతో అభిమానులు కాస్త కంగారుపడ్డారు. కానీ మేకర్స్ తాజా ప్రకటనతో ఆ అనుమానాలన్నింటికీ తెరపడింది. ఇక సెప్టెంబర్ 24న జాదల్ను థియేటర్లలో చూడటమే మిగిలింది. ‘దసరా’ తర్వాత నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.