51 మంది వైఎస్సార్సీపీ లీడర్లపై రౌడీషీట్లు
ఐదేళ్ల నాటి కేసులో వైఎస్సార్సీపీ లీడర్లపై రౌడీషీట్లు.. జాబితాలో ఎమ్మెల్సీ తలశిల రఘురాం, దేవినేని అవినాష్
విజయవాడలో వైఎస్సార్సీపీ లీడర్లపై రౌడీషీట్లు తెరవాలంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఆ పార్టీకి చెందిన 51 మంది నాయకులు, కార్యకర్తలపై ఒకేసారి రౌడీషీట్లు తెరవాలని ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆదేశించింది. ఒక ప్రతిపక్ష పార్టీ నగర నాయకత్వాన్ని మొత్తంగా రౌడీల జాబితాలోకి ఎక్కించే ఇలాంటి ఆదేశాలు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ రాలేదు.
ఈ మేరకు కమిషనరేట్ నుంచి మంగళవారం (సెప్టెంబర్ 22) మెమో విడుదలైంది. 2021లో మంగళగిరి టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసును ఆధారంగా చూపుతూ ఈ ఆదేశాలు ఇచ్చారు.
జాబితాలో ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైఎస్సార్సీపీ విజయవాడ ముఖ్యనేత దేవినేని అవినాష్ పేర్లు ఉన్నాయి. కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ అరవ సత్యం, కార్పొరేటర్ కాలపాల అంబేడ్కర్ కూడా ఉన్నారు.
వీరితో పాటు పలు డివిజన్ల నాయకులు, సామాన్య కార్యకర్తలు జాబితాలో ఉన్నారు. ఆటో డ్రైవర్లు, డీజే ఆపరేటర్, చిన్న వ్యాపారులు, ఒక మహిళ పేరు కూడా ఇందులో ఉంది.
భవానీపురం, అజిత్‌సింగ్‌నగర్, నున్న, కృష్ణలంక, మాచవరం, పటమట, గవర్నర్‌పేట, గుణదల, సత్యనారాయణపురం స్టేషన్ల ఎస్హెచ్ఓలకు ఈ ఆదేశాలు వెళ్లాయి. తమ పరిధిలో ఉంటున్న వైఎస్సార్సీపీ లీడర్లపై రౌడీషీట్లు తెరిచి నివేదిక పంపాలని సూచించారు.
నగరంలోని నలుగురు ఏసీపీలు ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాలని మెమోలో స్పష్టం చేశారు. ఒక్కరు కూడా తప్పిపోకుండా పకడ్బందీగా అమలు చేయాలన్నది ఆదేశాల సారాంశం.
మంగళగిరి ఘటన జరిగి ఐదేళ్లు గడిచింది. ఈ కేసులో అరెస్టులు, నోటీసులు, బెయిళ్లు అన్నీ 2024లోనే పూర్తయ్యాయి. కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది.
అయినా ఇన్నాళ్లూ లేని రౌడీషీట్ల ప్రస్తావన ఇప్పుడే ఎందుకు వచ్చిందన్నది ప్రధాన ప్రశ్నగా మారింది.
పోలీసులు తయారుచేసిన జాబితాలోనే కీలక వివరాలు ఉన్నాయి. 51 మందిలో 19 మందికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంటే వీరికి న్యాయస్థానమే రక్షణ కల్పించింది.
తలశిల రఘురాం, దేవినేని అవినాష్ సహా ముగ్గురిని పోలీసులు అప్పట్లో అరెస్టు చేయలేదు. కేవలం నోటీసులు ఇచ్చి పంపారు. అరెస్టు అవసరం లేదని భావించినవారిని ఇప్పుడు రౌడీలుగా ఎలా పరిగణిస్తారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జాబితా ప్రకారం 2024లో అరెస్టయినవారు 13 మంది మాత్రమే. ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మరో 14 మంది విషయంలో అరెస్టు గానీ, బెయిల్ గానీ ఎలాంటి వివరాలూ జాబితాలో లేవు. అయినా అందరినీ ఒకే గాటన కట్టి రౌడీషీట్లకు ఆదేశించడం గమనార్హం.
సాధారణంగా తరచూ నేరాలకు పాల్పడేవారిపై, శాంతిభద్రతలకు నిరంతర ముప్పుగా ఉన్నవారిపై రౌడీషీట్లు తెరుస్తారు. విచారణలో ఉన్న ఒక్క కేసు ఆధారంగా ఒకేసారి 51 మందిపై తెరవడం ఏమిటని న్యాయవర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
ఈ ఆదేశాలు వచ్చిన సమయం కూడా చర్చనీయాంశంగా మారింది. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. నిరుద్యోగుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.
సరిగ్గా ఇదే సమయంలో వైఎస్సార్సీపీ లీడర్లపై రౌడీషీట్లకు ఆదేశాలు రావడం యాదృచ్ఛికం కాదని ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. డీఎస్సీ ఉద్యమాన్ని అణచివేయడానికే ప్రభుత్వ పెద్దలు ఈ అస్త్రాన్ని ప్రయోగించారని మండిపడుతున్నాయి.
రౌడీషీట్ తెరిస్తే తరచూ పోలీస్ స్టేషన్లో హాజరు వేయించుకోవాలి. కదలికలపై నిరంతర నిఘా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నాయకులు ఉద్యమాల్లో పాల్గొనడం కష్టమవుతుంది.
ప్రశ్నించే నాయకులను భయపెట్టి ఇళ్లకే పరిమితం చేయడమే దీని వెనుక ఉద్దేశమని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజాప్రతినిధులను సైతం రౌడీల జాబితాలో చేర్చడం ప్రజాస్వామ్యానికే అవమానమని పేర్కొంటున్నారు.
ఒకే కేసులో ఇంత పెద్దఎత్తున, ఇంత హడావుడిగా వైఎస్సార్సీపీ లీడర్లపై రౌడీషీట్లు తెరవడానికి కారణాలేంటో పోలీసు ఉన్నతాధికారులు ఇంకా స్పష్టం చేయలేదు. ఈ ఆదేశాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
జాబితాలో ఉన్నవారు:
తలశిల రఘురాం (ఎమ్మెల్సీ), దేవినేని అవినాష్, అరవ సత్యం (కార్పొరేటర్), కాలపాల అంబేడ్కర్ (కార్పొరేటర్), షేక్ అబ్దుల్లా, కొమటపల్లి దుర్గారావు, జోగ రమణ, గోకా దుర్గాప్రసాద్, లంక అబ్బినాయుడు, జోగ రాజు, షేక్ బాబు, షేక్ సైదా, రాజని సుధాకర్, ఎల్లబోయిన ప్రభుదాసు, కర్నాటి రామస్వామి, మద్దెల పవన్ కుమార్, సొంగా సుధీర్ వర్మ, కొమిర రమేష్ బాబు, పాల భాగ్యరాజ్, సెటికం దుర్గారావు, బచ్చు మురళీకృష్ణ, చల్లా వీరస్వామి, కాసగోని దుర్గారావు, కండ్ర ఏడుకొండలు, మద్దెల సాయి, పంతల సాయిబాబు, పుప్పాల రాజా, ముళ్లపూడి సాయి సంతోష్, కాండ్రు శ్రీరాజ్, కొరివి చైతన్య, నందెపు జగదీశ్, సుంకర శ్రీను, అవుతు శ్రీనివాసరెడ్డి, మీసాల రామకృష్ణ, బండారు ఆంజనేయులు, సనగశెట్టి హరిబాబు, మొదుగుల గణపతిరావు, ఒగ్గు గవాస్కర్, బచ్చు మాధవి కృష్ణ, పసుపులేటి ఏసు, వరికూటి నాగిరెడ్డి, మన్యం జగదీశ్, మద్దాళి వెంకట సుబ్బారావు, షేక్ అమితాబ్, గెల్లిపోగు రాజు, ఎజ్జాడ తేజేష్, పరస కృష్ణ, ఉత్తరిల్లి రమేష్, పల్లపోతు మురళీకృష్ణ, పుప్పాల లిఖిత్ బాబు, కర్నేటి వెంకటేశ్వరరావు.
చంద్రబాబుకు బిగ్ షాక్.. మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్
బెజవాడ మేయర్ పోరు: రాధా vs భాగ్యలక్ష్మి