హైకోర్టుకు ఐదుగురు శాశ్వత న్యాయమూర్తులు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ఐదుగురు శాశ్వత న్యాయమూర్తులు వచ్చారు. ఇప్పటివరకు అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న వీరు సోమవారం శాశ్వత న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు.
జస్టిస్ కుంచం మహేశ్వరరావు, జస్టిస్ తూట చంద్ర ధనశేఖర్ (టీసీడీ శేఖర్), జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు ప్రమాణ స్వీకారం చేశారు.
అమరావతిలోని హైకోర్టు మొదటి కోర్టు హాల్‌లో ఫుల్ బెంచ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ఐదుగురితో ప్రమాణం చేయించారు. ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ లీసా గిల్ ఈ ఏడాది ఏప్రిల్‌లో బాధ్యతలు చేపట్టారు.
ఈ ఐదుగురిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించే ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. దాంతో కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.
హైకోర్టులో సేవలందిస్తున్న న్యాయమూర్తులందరూ ఈ వేడుకకు హాజరై కొత్త శాశ్వత న్యాయమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో బార్ కౌన్సిల్ ప్రతినిధులు, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు, న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
చంద్రబాబుకు బిగ్ షాక్.. మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్
గుడివాడ–హనుమాన్ జంక్షన్ రోడ్డు: నాలుగు వరసలు ఎప్పుడు?