బెజవాడ బులెటిన్ వార్తలు మాత్రమే కాదు.. మీకు అవసరమైన సమాచారం కూడా
వార్తలు

సివిల్‌ సర్వీసెస్‌ రూల్స్‌ పరిధిలోకి డిప్యూటీ తహసీల్దార్లు

6 October 2026 2 నిమిషాల చదువు
సివిల్‌ సర్వీసెస్‌ రూల్స్‌ పరిధిలోకి డిప్యూటీ తహసీల్దార్లు
డిప్యూటీ తహసీల్దార్లను సివిల్‌ సర్వీసెస్‌ రూల్స్‌లో కేటగిరీ–4గా చేర్చిన ప్రభుత్వం

అమరావతి: డిప్యూటీ తహసీల్దార్ల సర్వీస్‌ రూల్స్‌లో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఇప్పటివరకు ఈ పోస్టుకు వర్తిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌–1992ను రద్దు చేసి.. డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టును ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ (ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌) రూల్స్‌లో కేటగిరీ–4గా చేర్చింది.

అంటే డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టు రద్దు కాలేదు. ఈ పోస్టుకు వర్తించే పాత సర్వీస్‌ రూల్స్‌ స్థానంలో కొత్త సర్వీస్‌ రూల్స్‌ వచ్చాయి. ఇకపై డిప్యూటీ తహసీల్దార్ల నియామకం, సర్వీస్‌, ప్రమోషన్‌, బదిలీ తదితర అంశాలు కొత్త రూల్స్‌ పరిధిలో ఉంటాయి.

డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌తో పాటు రెవెన్యూ శాఖలోని సీనియర్‌ అసిస్టెంట్ల నుంచి బదిలీ ద్వారా భర్తీ చేయనున్నారు. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌కు డిగ్రీ అర్హతగా నిర్ణయించారు. నోటిఫికేషన్‌ వెలువడే ఏడాది జూలై 1 నాటికి 34 ఏళ్లు మించకూడదని వయోపరిమితి విధించారు.

సీనియర్‌ అసిస్టెంట్‌ నుంచి డిప్యూటీ తహసీల్దార్‌గా బదిలీ ద్వారా రావాలంటే కనీసం నాలుగేళ్ల సర్వీస్‌ ఉండాలి. ఇందులో రెండేళ్లు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి ఉండాలి.

డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టులను ఆరు జోన్ల పరిధిలో ఏర్పాటు చేశారు. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌లో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్‌ వర్తించనుంది. డైరెక్ట్‌గా నియమితులైన వారికి ఏడాది శిక్షణ, బదిలీ ద్వారా వచ్చిన వారికి ఆరు నెలల శిక్షణ ఇవ్వనున్నారు.

షేర్ చేయండి