అమరావతిలో నెలకు రూ.2 వేల కోట్ల పనులు చేయాలి: చంద్రబాబు
అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణ పనులకు మరింత వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను, నిర్మాణ సంస్థలను ఆదేశించారు. రాజధాని పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న పనుల విలువను నెలకు రూ.2 వేల కోట్లకు పెంచేలా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. అమరావతి రాజధాని పనులపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సీఎం నెలవారీ సమీక్ష నిర్వహించారు.
రాజధాని పరిధిలో చేపట్టిన 152 ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 41 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి పి.నారాయణ ముఖ్యమంత్రికి వివరించారు. ఆయా ప్రాజెక్టుల పురోగతి, పనుల స్థితిగతులను అధికారులు సీఎంకు వివరించారు.
గడిచిన నెలలో అమరావతిలో రూ.1,345 కోట్ల విలువైన పనులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ పనుల విలువను నెలకు రూ.2 వేల కోట్లకు తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించారు. పనుల్లో ఎక్కడా అశ్రద్ధ, నిర్లక్ష్యం లేకుండా వేగంగా, నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుపై దృష్టి
రాజధాని నిర్మాణ పనులతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించాలని చంద్రబాబు సూచించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు.
ఐకానిక్ భవనాలపై ప్రత్యేక దృష్టి
అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల పనుల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. సచివాలయ టవర్లు, అసెంబ్లీ భవనం ఐకానిక్గా ఉండేలా నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు.
నిర్మాణ రంగంలో నైపుణ్యాలపై దృష్టి
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తరహాలో నిర్మాణ రంగంలో పనిచేసే వారికి ఆధునిక నైపుణ్యాలను అందించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. రాజధాని నిర్మాణంతో పాటు నిర్మాణ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయాలని సూచించారు.
ఈ సమీక్షకు పురపాలక శాఖ మంత్రి పి.నారాయణతో పాటు కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
చంద్రబాబుకు బిగ్ షాక్.. మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్
గుడివాడ–హనుమాన్ జంక్షన్ రోడ్డు: నాలుగు వరసలు ఎప్పుడు?