బీసీలకు పెంపు.. ఎవరికి కోత?
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల లెక్కలు ఖరారయ్యాయి. గ్రామాల్లో బీసీలకు 23 నుంచి 25 శాతం సీట్లు దక్కుతుండగా, పట్టణాల్లో ఆ వాటా 33 నుంచి 35 శాతానికి పెరిగింది.
బీసీలకు పెరిగిన ఈ వాటా ఎక్కడి నుంచి వస్తోంది? ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి 50 శాతం దాటకూడదన్న నిబంధన ఉండగా, పట్టణాల్లో ఈ లెక్క ఎలా సరిపోతుంది? ఇప్పుడు ఇదే అసలు ప్రశ్న.
గ్రామాల్లో బీసీలకు ఇలా..
ఖరారైన వివరాల ప్రకారం రాష్ట్రంలోని 1,33,910 పంచాయతీ వార్డుల్లో బీసీలకు 30,315 సీట్లు దక్కనున్నాయి. ఇది 22.6 శాతం.
13,351 సర్పంచ్ స్థానాల్లో 3,128 బీసీలకు రిజర్వ్ అయ్యాయి. 9,913 ఎంపీటీసీ స్థానాల్లో 2,400 సీట్లు బీసీలకు వస్తున్నాయి.
661 ఎంపీపీ స్థానాల్లో 152, అలాగే 661 జెడ్పీటీసీ స్థానాల్లో 152 బీసీలకు దక్కుతున్నాయి. 28 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవుల్లో 7 బీసీలకు కేటాయించారు.
గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీల వాటా 23 నుంచి 25 శాతం మధ్యే ఉంది. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు కలిపినా ఇక్కడ 50 శాతం పరిమితి దాటే పరిస్థితి లేదు.
పట్టణాల్లో భారీ పెంపు
పట్టణ స్థానిక సంస్థల్లో మాత్రం లెక్క పూర్తిగా మారింది. రాష్ట్రంలోని 3,884 మున్సిపల్ వార్డుల్లో 1,273 సీట్లు బీసీలకు దక్కుతున్నాయి. ఇది 32.8 శాతం.
106 మున్సిపల్ ఛైర్మన్ పదవుల్లో 35 బీసీలకు రిజర్వ్ అయ్యాయి. ఇది 33 శాతం. 17 కార్పొరేషన్ మేయర్ పదవుల్లో 6 బీసీలకు కేటాయించారు. అంటే 35.29 శాతం.
50 శాతం లెక్క ఎలా?
పట్టణ స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ప్రభుత్వం ఆదివారం జీవో ఎంఎస్ నంబర్ 251 జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి 50 శాతం మించకూడదని ఇందులో స్పష్టంగా పేర్కొంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకే ఈ నిబంధన పెట్టినట్లు తెలిపింది.
ఈ పరిమితి ప్రకారం 17 మేయర్ పదవుల్లో గరిష్ఠంగా 8 మాత్రమే రిజర్వ్ చేయవచ్చు. అందులో 6 బీసీలకు ఇస్తే, ఎస్సీ, ఎస్టీలకు కలిపి మిగిలేది 2 పదవులే.
106 మున్సిపల్ ఛైర్మన్ పదవుల్లో 53 వరకు రిజర్వ్ చేయవచ్చు. బీసీలకు 35 పోగా ఎస్సీ, ఎస్టీలకు మిగిలేది 18. అంటే 17 శాతం.
3,884 మున్సిపల్ వార్డుల్లో 1,942 వరకు రిజర్వ్ చేయవచ్చు. బీసీలకు 1,273 పోగా ఎస్సీ, ఎస్టీలకు మిగిలేది 669 సీట్లు. ఇది కూడా 17 శాతమే.
2021లో ఎస్సీ, ఎస్టీలకు ఎంత?
2021 మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్పర్సన్, మేయర్ పదవులకు ఎస్టీలకు 6.7 శాతం, ఎస్సీలకు 19.08 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. రెండూ కలిపి దాదాపు 26 శాతం.
అప్పుడు 50 శాతం పరిమితిలో ఉంచేందుకు బీసీల వాటాను 34 శాతం నుంచి 24.15 శాతానికి తగ్గించారు.
ఇప్పుడు బీసీలకు 33 శాతం ఇస్తే, ఎస్సీ, ఎస్టీల వాటా 26 శాతం నుంచి 17 శాతానికి పడిపోవాలి. లేదంటే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటిపోతాయి.
రాష్ట్రంలో ఎస్సీలకు 15, ఎస్టీలకు 6.5 శాతం లెక్కన 21.5 శాతం వేసుకున్నా, పట్టణాల్లో మొత్తం రిజర్వేషన్లు 54 నుంచి 57 శాతానికి చేరుతున్నాయి.
ఎస్సీ, ఎస్టీ వాటా తగ్గించవచ్చా?
రాజ్యాంగం ప్రకారం పట్టణ స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు ఆ పట్టణంలోని వారి జనాభా నిష్పత్తిలో సీట్లు కేటాయించాలి. ఇవి తప్పనిసరి రిజర్వేషన్లు.
అంటే ఎస్సీ, ఎస్టీ సీట్లను ప్రభుత్వం ఇష్టానుసారం తగ్గించడానికి వీల్లేదు. వారి జనాభా వాటా తగ్గినట్లు కొత్త లెక్కల్లో తేలితేనే సీట్లు తగ్గుతాయి.
ఈసారి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, SGSW డేటా ఆధారంగా పట్టణాల్లో వర్గాల వారీ రిజర్వేషన్లు నిర్ణయిస్తామని జీవోలో పేర్కొన్నారు. ఆ కొత్త డేటాలో పట్టణ ఎస్సీ, ఎస్టీ జనాభా వాటా 2021 కంటే తక్కువగా చూపించారా అన్నది ఇప్పుడు కీలకం.
కోర్టు చిక్కులు తప్పవా?
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం గతంలో జీవోలు తెచ్చింది. హైకోర్టు వాటిని రద్దు చేసింది. సుప్రీంకోర్టు కూడా 34 శాతానికి అనుమతి ఇవ్వలేదు.
దీంతో చట్టపరంగా కుదరకపోయినా పార్టీ టికెట్లలో బీసీలకు 34 శాతం ఇస్తామని టీడీపీ ఇటీవల ప్రకటించింది.
ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా, సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ విధానంలో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశారు.
అయితే పట్టణాల్లో ఎస్సీ, ఎస్టీల వాటా తగ్గితే ఆ వర్గాల నుంచి అభ్యంతరాలు రావచ్చు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటితే మళ్లీ కోర్టుకెక్కే అవకాశమూ ఉంది. ఏ దారిలో వెళ్లినా ఎన్నికల ముందు ఈ లెక్క వివాదంగా మారే సూచనలే కనిపిస్తున్నాయి.
బీసీలకు పెంచిన సీట్లు ఎవరి వాటా నుంచి వస్తున్నాయన్న దానిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. డివిజన్లు, వార్డుల వారీ రిజర్వేషన్ల జాబితా వస్తేనే అసలు లెక్క తేలుతుంది.
బెజవాడ మేయర్ పోరు: రాధా vs భాగ్యలక్ష్మి
జనసేనను గోదావరికే పరిమితం చేశారా?
జనసేనకు ఆ నాలుగు మేయర్ సీట్లు