కృష్ణా జిల్లా అవనిగడ్డ రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర స్థాయిలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఐక్యత గురించి అధినేతలు పదేపదే చెబుతున్నా, అవనిగడ్డ నియోజకవర్గంలో మాత్రం మిత్రపక్షాల మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన ఎమ్మెల్యే, శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ విజయవాడలో జరిగిన రోశయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. “ఈసారి ఎమ్మెల్యేగా గెలవడమే పెద్ద తప్పు చేశాననిపిస్తోంది.. రాజకీయాల్లో ఎందుకున్నానో అనిపిస్తోంది. దిగజారిన రాజకీయ విలువలను చూసి రోజూ బాధపడుతున్నాను” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
2024 ఎన్నికల పొత్తులో అవనిగడ్డ సీటు జనసేన కోటాకు వెళ్లింది. అప్పటివరకు టీడీపీలో ఉన్న మండలి బుద్ధప్రసాద్ చివరి క్షణంలో జనసేనలో చేరి టికెట్ దక్కించుకుని గెలిచారు. టీడీపీ నేపథ్యం ఉన్న నేత కాబట్టి రెండు పార్టీల కేడర్‌ను కలుపుకుపోతారని అంతా భావించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా మారింది. బుద్ధప్రసాద్ జనసేనలోకి వెళ్లాక అవనిగడ్డ టీడీపీకి ఇన్‌ఛార్జ్ నియామకం జరగలేదు. దీంతో మండల స్థాయి నాయకులే పార్టీ కార్యక్రమాలు నడుపుతున్నారు. ఎమ్మెల్యే టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులను జనసేనలోకి తీసుకెళ్తుండటంతో తాము బలహీనపడుతున్నామన్నది స్థానిక టీడీపీ నేతల ఆవేదన. పనుల కేటాయింపుల్లోనూ పక్కన పెడుతున్నారని, నియోజకవర్గ వ్యవహారాల్లో ఎమ్మెల్యే కుమారుడు, అల్లుడి జోక్యం ఎక్కువగా ఉంటోందని వారు ఆరోపిస్తున్నారు.
ఈ విభేదాలు ఇప్పటివి కావు. మార్చిలో కోడూరు గ్రామంలో రోడ్డు ప్రారంభోత్సవం విషయంలో టీడీపీ నేతలతో ఘర్షణ తర్వాత ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఏకంగా ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. కోడూరు మండల టీడీపీ నేతలు సమావేశమై ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తీర్మానాలు కూడా చేశారు. తాజాగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలోనూ కార్యకర్తలు ఎమ్మెల్యే తీరుపై బహిరంగంగా నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల మంత్రి నారా లోకేష్ నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు స్థానిక టీడీపీ నేతలు తమ అసంతృప్తిని ఆయన దృష్టికి తీసుకెళ్లగా, త్వరలో ఇన్‌ఛార్జ్‌ని నియమించి సమస్య పరిష్కరిస్తానని లోకేష్ హామీ ఇచ్చినట్లు సమాచారం. అయినా వారం తిరగకముందే మళ్లీ నిరసనలు చెలరేగడం గమనార్హం. కోడూరు, నాగాయలంక మండలాల నేతలు ఎమ్మెల్యేపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
కూటమి పార్టీల మధ్య ఈ తరహా విభేదాలు అవనిగడ్డకే పరిమితం కాలేదు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్‌ఛార్జ్ వలవల బాబ్జి మధ్య విభేదాలు కూడా తారస్థాయికి చేరాయి. నామినేటెడ్ పదవుల పంపకం, పనుల కేటాయింపులే చాలా చోట్ల వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ కుమ్ములాటలకు రెండు పార్టీల అధిష్ఠానాలు ఎలా చెక్ పెడతాయన్నది ఆసక్తికరంగా మారింది. దివిసీమ రాజకీయాల్లో తదుపరి పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.