వార్తలు & సమాచార హబ్  |  అమరావతి · విజయవాడ · గుంటూరు
Tuesday, July 28, 2026
విజయవాడ  38°C ☀️
Blog

రావణ్‌పై ఉపా కేసు.. చట్టాన్ని అతిగా వాడుతున్నారా? ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు

📅 July 7, 2026 ✍ News Desk ⏱ 1 నిమిషాల చదువు
విజయవాడ ప్రెస్ క్లబ్‌లో రావణ్‌పై యూఏపీఏ కేసుపై మాట్లాడుతున్న ఏబీ వెంకటేశ్వరరావు

యూట్యూబర్‌ రావణ్‌పై నమోదు చేసిన యూఏపీఏ (UAPA) కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూనే, మరోవైపు అలాంటి కేసులో ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ప్రయోగించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నను మాజీ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు లేవనెత్తారు. విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు న్యాయవాది నల్లమోతు చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రావణ్‌ చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచేలా ఉన్నాయని, అలాంటి వ్యాఖ్యలను తాము ఏ మాత్రం సమర్థించడం లేదని స్పష్టం చేశారు. అయితే, ఆ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటే భారతీయ న్యాయ సంహిత (BNS )లో ఇప్పటికే తగిన చట్టపరమైన నిబంధనలు ఉన్నాయని, ఉగ్రవాద నిరోధక చట్టమైన యూఏపీఏను ప్రయోగించడం చట్టబద్ధతపై సందేహాలు కలిగిస్తోందన్నారు.

’చేతిలో అధికారం ఉందని UAPA వాడకూడదు’

ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను దెబ్బతీసేలా యూఏపీఏను విచక్షణారహితంగా ఉపయోగించడం సరైంది కాదని ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎవరు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించినా లేదా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా వెంటనే ఉగ్రవాద చట్టాన్ని ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.

రావణ్‌ కేసులో పోలీసులు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న అంశాలు కోర్టులో నిలబడే అవకాశం తక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వీడియో మొత్తాన్ని కాకుండా కొన్ని భాగాలను మాత్రమే ఆధారంగా తీసుకుని కేసు నమోదు చేశారని ఆరోపించారు.

టాడా, పోటా తర్వాత ఇప్పుడు UAPA?

యూఏపీఏ చట్టం దుర్వినియోగంపై మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు, భారతదేశంలో గతంలో అమల్లో ఉన్న టాడా, పోటా చట్టాలను గుర్తు చేశారు. టాడా చట్టం దుర్వినియోగం కావడంతో రద్దు చేశారని, తరువాత వచ్చిన పోటా కూడా నిలవలేదన్నారు. ఇప్పుడు యూఏపీఏ కూడా అదే విధంగా విస్తతంగా వినియోగిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

భగత్‌సింగ్‌పై కూడా బ్రిటీష్‌ పాలనలో ఇలాంటి కఠిన చట్టాలు ప్రయోగించారని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా అలాంటి విధానాలు కొనసాగడం ఆందోళన కలిగించే విషయమన్నారు.

’రావణ్‌ను సమర్థించడం లేదు.. కానీ చట్టం వేరే విషయం’

రావణ్‌ మావోయిస్టు కాదని తాము చెప్పడం లేదని, అలాగే ఆయన వ్యాఖ్యలను కూడా సమర్థించడం లేదని ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అయితే చట్టం అందరికీ ఒకే విధంగా వర్తించాలే తప్ప, కేసు స్వభావాన్ని మించి కఠిన చట్టాలను ప్రయోగించడం న్యాయసమ్మతం కాదన్నారు.

రావణ్‌పై నమోదైన ఇతర కేసుల్లో ఇప్పటికే బెయిల్‌ లభించిందని, ఈ కేసులో కూడా సాధారణ చట్టాల ప్రకారమే విచారణ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

సోషల్‌ మీడియాపై హెచ్చరిక

ఇటీవల సోషల్‌ మీడియాలో కులాలు, మతాల పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు పెరుగుతున్నాయని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. అలాంటి ప్రచారాలను రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు సోషల్‌ మీడియాలో వచ్చే ప్రతి విషయాన్ని నమ్మకుండా, సమాజానికి ఉపయోగపడే అంశాలపైనే స్పందించాలని సూచించారు.

నల్లమోతు చక్రవర్తి ఏమన్నారు?

న్యాయవాది నల్లమోతు చక్రవర్తి కూడా రావణ్‌ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవేనని అన్నారు. అయితే అలాంటి వ్యాఖ్యలకు యూఏపీఏ చట్టాన్ని వర్తింపజేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు రూపొందించిన చట్టాన్ని సాధారణ పౌరులపై ఉపయోగించడం ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు.

యూఏపీఏ కింద వేలాది మంది అరెస్టు అయినప్పటికీ, శిక్షలు పడిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పారు. బెయిల్‌ రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కఠిన చట్టాలను ఉపయోగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై ఇలాంటి చట్టాలు ప్రయోగించే పరిస్థితి రాకూడదంటే యూఏపీఏ అమలుపై సమగ్ర సమీక్ష అవసరమని, చివరికి ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

🔗 ఈ వార్తను షేర్ చేయండి
📰 సంబంధిత వార్తలు
📰 తాజా వార్తలు
📢 Advertisement
300×250
Google AdSense