ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భుజం శస్త్రచికిత్స అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ముంబై వెళ్లి ఆయనను పరామర్శించారు. జూలై 11న ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి సుమారు మూడున్నర గంటల పాటు సంక్లిష్టమైన శస్త్రచికిత్స జరిగింది. సర్జరీ విజయవంతం కావడంతో అభిమానులు, జనసైనికులు ఊపిరి పీల్చుకున్నారు.
అరగంటకు పైగా ఆసుపత్రిలోనే సీఎం
సాధారణంగా అయితే పవన్ హైదరాబాద్ లేదా అమరావతికి తిరిగి వచ్చాక కలవొచ్చు. కానీ చంద్రబాబు అలా ఆగలేదు. సర్జరీ పూర్తై, పవన్ సందర్శకులతో మాట్లాడగలిగే స్థితికి రాగానే స్వయంగా ముంబై చేరుకున్నారు. ఆసుపత్రిలో అరగంటకు పైగా గడిపిన సీఎం.. పవన్ ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్స గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు.
ఏం మాట్లాడుకున్నారు?
కేవలం ఆరోగ్య పరామర్శతోనే ఆగలేదు ఈ భేటీ. రాష్ట్ర అభివృద్ధి అంశాలు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా ఇద్దరు నేతలు చర్చించినట్లు సమాచారం. త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో పాల్గొనాలని చంద్రబాబు ఆకాంక్షించారు. పవన్‌కు అవసరమైన అన్ని రకాల వైద్య సహాయం అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జనసేన షేర్ చేసిన ఫోటోలు వైరల్
ఈ పరామర్శ ఫోటోలను జనసేన పార్టీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసింది. కుడి చేతికి స్లింగ్‌తో ఆసుపత్రి బెడ్‌పై కూర్చున్న పవన్ పక్కన చంద్రబాబు కనిపించారు. సర్జరీ వార్త తెలిసినప్పటి నుంచి ఆందోళనలో ఉన్న పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఈ ఫోటోలు ఊరటనిచ్చాయి.
2016 నుంచి వేధిస్తున్న గాయం
2016 నుంచి పవన్‌ను భుజం సమస్య వేధిస్తోంది. తీవ్రమైన రొటేటర్ కఫ్ గాయాలు, కండరాల చిరుగుళ్లతో పాటు కుడి భుజంలో అవల్షన్ ఫ్రాక్చర్ కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్షా పార్డీవాలా నేతృత్వంలోని వైద్య బృందం ఈ శస్త్రచికిత్స నిర్వహించింది. ఏళ్ల తరబడి ప్రజా కార్యక్రమాలు, రాజకీయ ప్రచారాల్లో పాల్గొనడంతో రెండు భుజాల్లోనూ గాయాలు తీవ్రమయ్యాయని, రెండు నెలల తర్వాత మరో సర్జరీ చేయనున్నారని తెలుస్తోంది
కూటమిలో బలమైన బంధానికి నిదర్శనం
రాజకీయాల్లో పొత్తులు సహజం.. కానీ వ్యక్తిగత క్లిష్ట సమయంలో స్వయంగా వెళ్లి పరామర్శించడం ఇద్దరు నేతల మధ్య ఉన్న అనుబంధానికి అద్దం పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. రాబోయే వారాల్లో పవన్ రిహాబిలిటేషన్‌పై దృష్టి పెట్టనుండగా.. పూర్తిగా కోలుకున్న తర్వాత దశలవారీగా రాజకీయ, సినీ కార్యకలాపాల్లోకి తిరిగి వస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి.