Cholesterol Symptoms ఇప్పుడు 30–35 ఏళ్ల యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే కొలెస్ట్రాల్ సమస్య ఇప్పుడు జీవనశైలి మార్పులతో చిన్న వయసులోనే బయటపడుతోంది. ఇటీవల యువతలో గుండెపోటు ఘటనలు పెరగడం, ఆరోగ్య పరీక్షల్లో అధిక కొలెస్ట్రాల్ బయటపడుతుండటంతో వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రోజువారీ జీవనశైలి, ఫాస్ట్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణాలని చెబుతున్నారు.
కొలెస్ట్రాల్ అనేది శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థమే. హార్మోన్ల తయారీ, కణాల నిర్మాణం వంటి కీలక ప్రక్రియలకు ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇది అవసరమైన మోతాదును మించి పెరిగితే సమస్య మొదలవుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెకు రక్తప్రసరణ తగ్గే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
వైద్యుల ప్రకారం కొలెస్ట్రాల్ ఒక్కరోజులో పెరగదు. మన రోజువారీ అలవాట్లే దానికి ప్రధాన కారణం. గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం, ఫాస్ట్ ఫుడ్, బేకరీ పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, ధూమపానం, మద్యం వంటి అలవాట్లు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL)ను పెంచుతాయి. కుటుంబంలో తల్లిదండ్రులకు కొలెస్ట్రాల్ సమస్య ఉంటే పిల్లల్లో కూడా చిన్న వయసులోనే వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్యలో మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే… చాలామందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే వైద్యులు దీనిని “సైలెంట్ కిల్లర్” లేదా “సైలెంట్ రిస్క్ ఫ్యాక్టర్”గా పేర్కొంటారు. కొందరిలో మాత్రమే ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, త్వరగా అలసిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇవి గుండెపై ప్రభావం పడిన తర్వాతే బయటపడే అవకాశం ఉంటుంది. అందుకే లక్షణాలు లేకపోయినా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
రక్త పరీక్షలో సాధారణంగా LDL, HDL, ట్రైగ్లిసరైడ్స్ స్థాయిలను పరిశీలిస్తారు. LDLను చెడు కొలెస్ట్రాల్‌గా పరిగణిస్తారు. ఇది ఎక్కువైతే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. HDL మంచి కొలెస్ట్రాల్. ఇది రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది. ట్రైగ్లిసరైడ్స్ కూడా అధికంగా ఉంటే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
“40 ఏళ్లు దాటాక పరీక్షలు చేయించుకుంటే సరిపోతుంది” అనుకోవడం కూడా సరైన ఆలోచన కాదని వైద్యులు చెబుతున్నారు. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నా, మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం ఉన్నా 30 ఏళ్ల నుంచే లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా రెండు నుంచి ఐదు సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.
కొలెస్ట్రాల్ పెరిగిందంటే అందరికీ మందులు అవసరం ఉండవు. చాలామందిలో జీవనశైలిలో మార్పులు చేస్తేనే నియంత్రణలోకి వస్తుంది. రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం లేదా వ్యాయామం చేయడం, ఆకుకూరలు, పండ్లు, పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, నూనె పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ తగ్గించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ధూమపానం పూర్తిగా మానేయడం, మద్యం పరిమితం చేయడం, తగినంత నిద్రపోవడం కూడా గుండె ఆరోగ్యానికి ఎంతో అవసరం.
అయితే గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు, LDL స్థాయి అధికంగా ఉన్నవారు వైద్యుల సూచన మేరకు మందులు వాడాల్సి రావచ్చు. స్వయంగా మందులు కొనుగోలు చేసి వాడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
“ఇంకా చిన్న వయసే కదా” అని ఆరోగ్య పరీక్షలను వాయిదా వేయడం ప్రమాదానికి దారితీయొచ్చు. గుండెపోటు వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే, ముందుగానే కొలెస్ట్రాల్‌ను గుర్తించి అదుపులో ఉంచడం ఎంతో సురక్షితమని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమం తప్పకుండా పరీక్షలు, సమతుల ఆహారమే గుండెను కాపాడే ఉత్తమ మార్గమని స్పష్టం చేస్తున్నారు.