ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఎం.ఎస్. రాజు దర్శకత్వంలోని ‘అగాధ’ చిత్రానికి ఇండస్ట్రీ నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న సీనియర్ నిర్మాతలు, దర్శకులు ఈ చిత్రాన్ని కొనియాడారు.
కమాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సూపర్‌నేచురల్ డ్రామాను సాధారణ హారర్ చిత్రంగా చూడొద్దని ‘అరుంధతి’ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దాదాపు 45 ఏళ్ల స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ, ఎం.ఎస్. రాజును పాషనేట్ ఫిల్మ్‌మేకర్‌గా అభివర్ణించారు.
విజువల్స్, ఎడిటింగ్ విషయంలో చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుందని, కమాక్షి భాస్కర్ల ప్రెజెన్స్ చూస్తుంటే తనకు ‘అరుంధతి’లో అనుష్క తొలిసారి కనిపించినప్పటి అనుభూతి కలిగిందని శ్యామ్ ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రివర్స్ క్రోనాలజీ స్టోరీటెల్లింగ్, భారీ సీజీఐ వర్క్, వెన్నులో వణుకు పుట్టించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. దీనికి తోడు అమెరికాలో పంపిణీదారు మొదట 14 స్క్రీన్‌లు అనుకున్నా, సినిమా చూశాక ఏకంగా 140 స్క్రీన్‌లకు రిలీజ్‌ను విస్తరించడం విశేషం.
తెలుగు రాష్ట్రాల్లో గీత ఆర్ట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ నెట్‌వర్క్ ద్వారా చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కర్ణాటకలో వీకే ఫిల్మ్స్, తమిళనాడులో ఎస్ పిక్చర్స్ పంపిణీ బాధ్యతలు చేపట్టనున్నాయి.
ట్రైలర్‌కు వచ్చిన స్పందనతో అనేక పంపిణీ సంస్థల నుంచి ఆఫర్లు వచ్చినా, తన సినిమాపై నమ్మకంతో ఎం.ఎస్. రాజు స్వతంత్రంగా విడుదల చేయాలని నిర్ణయించుకోవడం గమనార్హం.స్వాతంత్ర్య దినోత్సవం వారాంతపు సెలవుల్లో విడుదల కావడంతో, ‘అగాధ’ భారీ ఓపెనింగ్‌ను అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండస్ట్రీ పెద్దల నుంచి వచ్చిన ప్రశంసలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.