రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల పాలనా విధానంలో పెద్ద మార్పు రాబోతోంది. నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో మేయర్లు, చైర్మన్ల ఎన్నికను ఇకపై ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న పరోక్ష ఎన్నికల విధానానికి ఇది తెరదించనుంది.
ఇప్పటివరకు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎన్నికైన తర్వాత వారిలో నుంచే మేయర్‌ను, చైర్మన్‌ను ఎన్నుకునే పద్ధతి అమల్లో ఉంది. దీని వల్ల తరచూ రాజకీయ సమీకరణాలు మారి పాలనలో అస్థిరత ఏర్పడుతోందని ప్రభుత్వం భావించింది. ఆయారాం.. గయారాం రాజకీయాలకు చెక్ పెట్టేలా, ప్రజలే నేరుగా మేయర్‌ను, చైర్మన్‌ను ఎన్నుకునేలా విధానం మార్చాలని కేబినెట్ తీర్మానించింది.
ఈ నిర్ణయం వల్ల నగర పాలనలో స్థిరత్వం పెరుగుతుందని, ప్రజలు ఎన్నుకున్న నేతకే నేరుగా జవాబుదారీతనం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మధ్యలో మేయర్‌ను మార్చే అవకాశం లేకుండా, ఐదేళ్ల పూర్తి కాలం ఒకే నేత పాలన సాగించే వీలు కలుగుతుంది. దీంతో దీర్ఘకాలిక ప్రణాళికలు, అభివృద్ధి పనులు నిలకడగా ముందుకు సాగుతాయని అంచనా.
ఇదే సమావేశంలో బీసీ రిజర్వేషన్లపైనా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33⅓ శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆమోదం తెలిపింది. చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారమే ఈ రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండదని, ప్రస్తుతం అమల్లో ఉన్నవే యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని అధికారులు కేబినెట్‌కు వివరించారు.
కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు అందాలంటే ఎన్నికలు అత్యవసరంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని కేబినెట్ అభిప్రాయపడింది. దీంతో పాటు ఇప్పటివరకు ఉన్న 13 జిల్లా ప్రజా పరిషత్‌లను 28 జడ్పీలుగా పునర్విభజన చేయాలని నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా జడ్పీలను సర్దుబాటు చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
కేబినెట్లో ఖరారైన ఈ నిర్ణయాలను ఆ తర్వాత అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. ప్రత్యక్ష ఎన్నికల విధానం, రిజర్వేషన్ల పెంపుతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికరంగా మారనున్నాయి.