అమరావతి ప్రయాణం ఇక ఈజీ కాబోతోంది. ఏళ్లుగా అందరూ ఎదురుచూస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి ప్రాజెక్టులు చివరకు పూర్తవుతున్నాయి.
ఆగస్టు 13న స్టీల్ బ్రిడ్జిని, ఆగస్టు 15న సీడ్ యాక్సెస్ రోడ్డును సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే విజయవాడ, గుంటూరు నుంచి అమరావతికి ప్రయాణం మరింత సులభమవుతుంది.
ఇప్పటివరకు అమరావతి వెళ్లాలంటే అందరూ కరకట్ట రోడ్డు మీదే ఆధారపడాల్సి వచ్చేది. వీఐపీ మూమెంట్స్ ఉన్నప్పుడు ఈ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు, రద్దీ వల్ల చాలా సేపు ఆగిపోవాల్సి వచ్చేది. ఇక ఈ కష్టాలు తీరనున్నాయి.
21 కిలోమీటర్ల పొడవైన సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతి మాస్టర్ ప్లాన్‌లో కీలక భాగం. విజయవాడ నుంచి నేరుగా రాజధానికి కలిపే ఈ రోడ్డు, భవిష్యత్తులో పెరగనున్న ట్రాఫిక్‌ను కూడా తట్టుకునేలా విశాలంగా డిజైన్ చేశారు.
అండవల్లి దగ్గర కృష్ణా డెల్టా కెనాల్, బకింగ్‌హామ్ కెనాల్, కొండవీటి వాగుల మీదుగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ఈ కారిడార్‌లో ప్రత్యేక ఆకర్షణ. అమరావతికి కొత్త గేట్‌వేగా ఈ బ్రిడ్జి నిలవనుందని అధికారులు చెబుతున్నారు.
రోడ్డు కనెక్టివిటీ మెరుగుపడితే పెట్టుబడులు పెరుగుతాయని, నిర్మాణ పనులు వేగం పుంజుకుంటాయని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిని పరిపాలనా, ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి ఈ ప్రాజెక్టులు ఊతమివ్వనున్నాయి.
ఇటీవలే సీఎం నాయుడు అమరావతిని విజయవాడ-గుంటూరుతో అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ క్యాపిటల్ రీజియన్‌గా తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ల ద్వారా మూడు నగరాల మధ్య ప్రయాణం మరింత సాఫీగా సాగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
రియల్ ఎస్టేట్ వర్గాలు కూడా ఈ డెవలప్‌మెంట్‌ను ఆసక్తిగా గమనిస్తున్నాయి. కనెక్టివిటీ మెరుగైతే విజయవాడ, గుంటూరులో ప్రాపర్టీ డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
మొత్తానికి, అమరావతి కల నిజమయ్యే దిశగా మరో ముందడుగు పడింది. ఆగస్టు 15 తర్వాత రాజధాని ప్రయాణం ఎలా మారుతుందో చూడాలి.