వార్తలు & సమాచార హబ్  |  అమరావతి · విజయవాడ · గుంటూరు
Sunday, August 30, 2026
విజయవాడ  38°C ☀️
వార్తలు

కాళ్లు పట్టుకున్నా సాధిక్‌ వదల్లేదు

📅 August 26, 2026 ✍ News Desk ⏱ 0 నిమిషాల చదువు
సాధిక్ ఖాన్ రిమాండ్ రిపోర్టు నూకరాజు కుటుంబం
డీఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్యకు కారణమైన సాధిక్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఆత్మహత్యకు రెండు నెలల క్రితం నూకరాజు సాధిక్‌ను బ్రతిమలాడి తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు ప్రయత్నించాడు. సాధిక్‌ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న అతడి తల్లి కాళ్ల మీద పడ్డాడు. ‘మీ అబ్బాయిని ఆపండి.. మా కుటుంబాన్ని బతకనివ్వండి’ అని బతిమాలాడు. ఆమె పట్టించుకోలేదు. కూతురి జీవితం కోసం ఒక తండ్రి ఇంతలా దిగజారినా సాధిక్‌ అతని కుటుంబం కనికరించలేదు. ఇంత వేధిస్తున్నా సాధిక్‌ గురించి ఒక్క మాట కూడా నూకరాజు ఎవరికీ చెప్పలేదు. ఒక్కసారైనా పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కలేదు. కాకినాడ ఎస్పీ బిందు మాధవ్‌ స్వయంగా చెప్పిన మాట ఇది. ‘సామూహిక ఆత్మహత్య ఘటనకు ముందు బాధితులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.‘ ఒక ప్రభుత్వ ఉద్యోగి, తనకు తెలిసిన నేరస్థుడి పేరు, అడ్రస్, ఫోన్‌ నంబర్‌ అన్నీ తెలిసినా.. ఎందుకు మౌనంగా ఉండిపోయాడు? అతని బ్లాక్‌మెయిలింగ్‌ భయపడ్డారు. 

సపోర్ట్‌ ఇస్తానంటూ దగ్గరై, సౌజన్య వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నాడు సాధిక్‌. అవి బయటపెడతానని బెదిరించాడు. ఫిర్యాదు చేస్తే కుటుంబాన్ని చంపేస్తానని, పిల్లాడిని టెర్రరిస్టులకు అమ్మేస్తానని హెచ్చరించాడు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే రక్షణ దొరకచ్చు, కానీ సమాజంలో పరువు పోతుంది. ఆ భయమే వాళ్లను కట్టిపడేసింది.

సౌజన్య తాను రాసిన లేఖలో ‘నాన్నకు మంచిపేరు తీసుకురావాలని చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా ఉండేదాన్ని’ అని పేర్కొంది. పరువు కాపాడుకోవాలన్న తపనే, చివరికి ప్రాణాలు తీసుకునే వరకూ వాళ్లను నెట్టింది.

రిమాండ్‌ రిపోర్ట్‌లో మరో బాధాకరమైన నిజం కూడా బయటపడింది. చనిపోయే ముందు నూకరాజు ఒక వీలునామా రాశాడు. ఆస్తులన్నీ ముగ్గురి పేరిట రాసిపెట్టాడు. తన సోదరి, మరో ఇద్దరు బంధువుల పేర్లు అందులో ఉన్నాయి. మనవడు రియాన్‌‡్ష పేరు అందులో లేదు. ఎందుకంటే వాడు కూడా తమతో పాటే చనిపోతాడని అనుకున్నారు. ఎంత నిస్సహాయంగా ఉంటే ఒక తాత, తన మనవడి భవిష్యత్తు గురించి ఆలోచించలేనంతగా కృంగిపోతాడు?

‘ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పోలీసులు అండగా ఉంటారు అని ఎస్పీ అన్నారు. ఈ మాట రెండు నెలల ముందే ఎవరైనా నూకరాజుకు చెప్పి ఉంటే? ఈ కుటుంబం ఇప్పుడు బతికే ఉండేదేమో.

బ్లాక్‌మెయిల్‌కు గురైన వాళ్లు మౌనంగా ఉండిపోవడం ఈ ఒక్క కేసుకే పరిమితం కాదు. తెలిసిన మనిషే వేధిస్తున్నప్పుడు, పరువు పోతుందన్న భయమే, పోలీసులను ఆశ్రయించకుండా ఆపేస్తుంది. నూకరాజు కుటుంబం విషాదం చెప్పే పాఠం ఇదే. ఏ విషయం గురించి అయినా భయపడొద్దు, ముందుగా మాట్లాడండి, ఎవరో ఒకరి దగ్గర మనసు విప్పి చెప్పుకోండి.

🔗 ఈ వార్తను షేర్ చేయండి
📰 సంబంధిత వార్తలు
📰 తాజా వార్తలు
📢 Advertisement
300×250
Google AdSense