బెజవాడ బులెటిన్ వార్తలు మాత్రమే కాదు.. మీకు అవసరమైన సమాచారం కూడా
ఇన్‌ఫ్రా

అమరావతికి స్మార్ట్ పవర్ నెట్‌వర్క్.. అండర్‌గ్రౌండ్ కేబులింగ్, స్మార్ట్ గ్రిడ్‌తో విద్యుత్ వ్యవస్థ

17 September 2026 3 నిమిషాల చదువు
అమరావతికి స్మార్ట్ పవర్ నెట్‌వర్క్.. అండర్‌గ్రౌండ్ కేబులింగ్, స్మార్ట్ గ్రిడ్‌తో విద్యుత్ వ్యవస్థ
అమరావతి క్యాపిటల్ సిటీలో విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్ ఏర్పాటు

అమరావతి విద్యుత్ మౌలిక వసతుల ఏర్పాటుకు ఏపీసీఆర్డీఏ కీలక చర్యలు చేపట్టింది. రాజధాని నగరంలో ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసేందుకు టెండర్ ప్రక్రియ ప్రారంభించింది. నగరంలో ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్ పంపిణీ, రిటైల్ సరఫరా నిర్వహణకు సంబంధించి టెండర్‌ను ఆహ్వానించింది. ఈ టెండర్‌ను సెప్టెంబర్ 10న ప్రారంభించి.. అక్టోబర్ 12 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది.

అండర్‌గ్రౌండ్ కేబులింగ్

అమరావతి పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలో ప్రధాన అంశం భూగర్భ విద్యుత్ కేబులింగ్. నగరంలోని రోడ్ల వెంట ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ యుటిలిటీ డక్టుల ద్వారా విద్యుత్ కేబుళ్లను తీసుకెళ్లే విధంగా ప్రణాళిక రూపొందించారు. అమరావతి ప్రణాళికలో 100 శాతం అండర్‌గ్రౌండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లక్ష్యంగా పేర్కొన్నారు.

స్మార్ట్ గ్రిడ్.. SCADA

విద్యుత్ వ్యవస్థను స్మార్ట్ గ్రిడ్ విధానంతో అనుసంధానించేలా ప్రణాళిక ఉంది. SCADA వ్యవస్థ, GIS ఆధారిత సబ్‌స్టేషన్లు, స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ సరఫరాను పర్యవేక్షించడం, లోపాలను గుర్తించడం, పవర్ ఫ్లోను నియంత్రించడం వంటి అంశాలను ఇందులో పొందుపరిచారు. మెయిన్ కంట్రోల్ స్టేషన్, సెకండరీ కంట్రోల్ స్టేషన్లు, మైక్రో గ్రిడ్ స్టేషన్లతో కూడిన వ్యవస్థను ప్రణాళికలో పేర్కొన్నారు.

మూడు దశల్లో పంపిణీ

ఏపీసీఆర్డీఏ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళిక ప్రకారం సంప్రదాయంగా ఉండే ఐదు దశల ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను మూడు దశలకు తగ్గించే విధానాన్ని ప్రతిపాదించారు. 400/220 కేవీ, 220/33 కేవీ, 33 కేవీ/415 వోల్ట్ స్థాయిల్లో వ్యవస్థను రూపొందించాలని పేర్కొన్నారు. 132 కేవీ, 11 కేవీ స్థాయిలను మధ్యలో తొలగించడం ద్వారా వ్యవస్థను సరళీకరించి నష్టాలను తగ్గించాలన్నది ప్రణాళిక ఉద్దేశం.

స్మార్ట్ మీటర్లు.. స్మార్ట్ లైటింగ్

అమరావతి పవర్ విజన్‌లో 100 శాతం స్మార్ట్ మీటరింగ్, స్మార్ట్ గ్రిడ్, విద్యుత్ పొదుపు చేసే ఎల్‌ఈడీ వీధి దీపాలకు ప్రాధాన్యం ఇచ్చారు. స్ట్రీట్‌లైట్లను రిమోట్‌గా పర్యవేక్షించడం, లోపాలను గుర్తించడం, అవసరాన్ని బట్టి లైటింగ్‌ను నియంత్రించడం వంటి స్మార్ట్ ఫీచర్లను కూడా ప్రతిపాదించారు.

ప్రస్తుతం ఏపీసీఆర్డీఏ చేపట్టిన టెండర్ ఈ మొత్తం పవర్ విజన్‌లో ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఏర్పాటు, విద్యుత్ పంపిణీ–రిటైల్ సరఫరా నిర్వహణకు సంబంధించిన తాజా చర్యగా చూడవచ్చు.

షేర్ చేయండి