బెజవాడ బులెటిన్ వార్తలు మాత్రమే కాదు.. మీకు అవసరమైన సమాచారం కూడా
ఇన్‌ఫ్రా

అమరావతి విమానాశ్రయం కోసం 20 వేల ఎకరాలా? గ్రౌండ్‌ రియాలిటీని అసలు చూడరా?

19 September 2026 3 నిమిషాల చదువు
అమరావతి విమానాశ్రయం కోసం 20 వేల ఎకరాలా? గ్రౌండ్‌ రియాలిటీని అసలు చూడరా?
అమరావతి విమానాశ్రయం కోసం 20 వేల ఎకరాల భూసమీకరణపై ప్రశ్నలు

అమరావతిలో విమానాశ్రయం నిర్మాణం కోసం 5 వేల ఎకరాలు అవసరమని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం ఏకంగా 20 వేల ఎకరాల భూసమీకరణ చేయాలని నిర్ణయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 20 వేల ఎకరాల్లో రైతులకు తిరిగి ఇచ్చే ప్లాట్లు, రోడ్లు, ఇతర మౌలిక వసతులకు భూములు కేటాయించిన తర్వాత 5 వేల ఎకరాలు విమానాశ్రయానికి మిగిలేలా ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ భూసమీకరణకు వచ్చే కేబినెట్‌ సమావేశంలో ఆమోదం తీసుకోనున్నట్లు చెప్పారు.

అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతోంది. 5 వేల ఎకరాల విమానాశ్రయం కోసం 20 వేల ఎకరాల భూమిని సమీకరించాల్సిన అవసరం ఏమిటి?

ఇప్పటికే రాజధాని పేరుతో రైతుల నుంచి భారీగా భూములు తీసుకున్నారు. ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న రైతుల భూములు రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణలోకి వెళ్లాయి. ఇప్పుడు మరోసారి వేల ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్ల వ్యవహారం పూర్తిగా కొలిక్కి వచ్చిందా? అప్పట్లో ప్రతిపాదించిన లేఅవుట్ల పరిస్థితి ఏమిటి? వాటిలో వాస్తవంగా ఎంత మేరకు అభివృద్ధి జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.

మరోవైపు అమరావతి ఇంకా పూర్తిస్థాయిలో నగరంగా రూపుదిద్దుకోలేదు. కనీస మౌలిక వసతులు, ప్రజా రవాణా సదుపాయాలు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. బస్సు, రైలు సదుపాయాలే ప్రస్తుత అవసరాలకు సరిపడే స్థాయిలో లేని పరిస్థితిలో.. దశాబ్దాలు, తరాల తర్వాత వచ్చే జనాభా అవసరాలను అంచనా వేసి ఇప్పుడే వేల ఎకరాల భూమిని సమీకరించాల్సిన అవసరం ఏమిటన్నది ప్రశ్న.

భవిష్యత్‌ జనాభా పెరుగుతుందని అంచనాలు ఉండొచ్చు. కానీ ఆ అంచనాల ఆధారంగా ప్రస్తుతం రైతుల చేతుల్లో ఉన్న సారవంతమైన, బహుళ పంటలు పండే భూములను తీసుకోవడంపై కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముందుగా ఇప్పటికే తీసుకున్న భూముల విషయంలో ఇచ్చిన హామీలు, రైతుల సమస్యలు, లేఅవుట్ల అభివృద్ధి వంటి అంశాలు పూర్తిగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

ఇక విజయవాడ గన్నవరం విమానాశ్రయం ఇప్పటికే ఉంది. దాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పుడు కొత్త విమానాశ్రయం కోసం వేల ఎకరాల భూమిని ఎందుకు సమీకరించాలి? కొత్త విమానాశ్రయం పేరుతో గన్నవరం విమానాశ్రయం భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న కూడా సహజంగానే వస్తోంది.

ప్రపంచస్థాయి నగరం పేరుతో భారీ ప్రాజెక్టులు ప్రకటించడం ఒక ఎత్తయితే.. వాస్తవ పరిస్థితులను పట్టించుకోవడం మరో ఎత్తు. అమరావతి ఇప్పటికీ నగరంగా పూర్తిస్థాయిలో నిలదొక్కుకోకముందే.. భవిష్యత్‌ అవసరాల పేరుతో మరో 20 వేల ఎకరాల భూసమీకరణ ఎందుకు? రైతుల భూములే ప్రతి భారీ ప్రాజెక్టుకు పరిష్కారంగా మారాలా? అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది.

ప్రపంచస్థాయి ప్రాజెక్టుల కంటే ముందు.. ప్రస్తుతం అమరావతిలో ఉన్న గ్రౌండ్‌ రియాలిటీని చూసి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదా?

షేర్ చేయండి