దుర్గమ్మా.. యంత్రాంగానికి కనువిప్పు ఎప్పుడమ్మా?
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. లక్షల మంది భక్తులు దుర్గమ్మ దర్శనం కోసం కొండకు తరలి వస్తున్నారు. ఏటా లాగే ఈసారీ వారికి దర్శనం దక్కుతుంది. కానీ దాని కోసం పడే కష్టాలు మాత్రం అన్నీ ఇన్నీ కావు.
ఏటా అవే తప్పులు. అవే ఇబ్బందులు. ఉత్సవాలు ముగియగానే సమీక్షలు, లోపాలు సరిదిద్దుతామన్న హామీలు. మరుసటి దసరాకు మళ్లీ అదే కథ. యంత్రాంగం పాఠాలు నేర్చుకోవడం లేదు.
కొండ మొత్తం పోలీసుల చేతుల్లోనే
ఉత్సవాల్లో ప్రధాన పాత్ర పోలీసులదే. కానీ ఆ పాత్రను వారు ఆధిపత్యంగా మార్చుకున్నారు. ఉత్సవాలు మొదలవగానే కొండ మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఉత్సవాలను తామే నిర్వహిస్తున్నట్లు ఇష్టానుసారం వ్యవహరిస్తారు.
పోలీసులకు కనిపించేది రద్దీ నియంత్రణ ఒక్కటే. ఎంతో భక్తితో, ఎన్నో ఆశలతో అమ్మవారిని చూడాలని వచ్చిన భక్తుల మనోభావాలు వారికి పట్టవు.
బారికేడ్ల మధ్య కుక్కి, ఐదారు కిలోమీటర్లు నడిపించి, గంటల తరబడి నిలబెడతారు. ఒకసారి క్యూలైన్లోకి వెళ్లాక బయటకు రావడానికి వీలుండదు. పిల్లలు, వృద్ధులు ఆకలేసినా, అలసిపోయినా భరించాల్సిందే.
వీఐపీలకే పెద్దపీట
అదే కొండపై వీఐపీలకు మాత్రం దారి క్షణాల్లో క్లియర్ అవుతుంది. ఒక్క ప్రముఖుడు కొండ ఎక్కితే చాలు. క్యూలైన్లు ఆగిపోతాయి. సామాన్యుల దర్శనాలు నిలిచిపోతాయి.
ఈసారి ఉత్సవాలను ప్రభుత్వం పెద్ద ఈవెంట్‌గా ప్లాన్ చేసింది. ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని నిర్ణయించింది. మంత్రులు స్వయంగా వెళ్లి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందిస్తున్నారు.
మూల నక్షత్రం రోజైన అక్టోబర్ 16న ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. భక్తుల రద్దీ అత్యధికంగా ఉండేదీ అదే రోజు. ఇంతమంది ప్రముఖుల మధ్య సామాన్య భక్తుడి పరిస్థితి ఏంటన్నది ఎవరూ ఆలోచించడం లేదు.
చేష్టలుడిగిన రెవెన్యూ
ఉత్సవాల సమన్వయం జిల్లా యంత్రాంగం బాధ్యత. కానీ పోలీసుల ఆధిపత్యం ముందు రెవెన్యూ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. కలెక్టర్ అప్పుడప్పుడు వచ్చి తనిఖీలు చేసి వెళ్లడానికే పరిమితమవుతున్నారు.
క్యూలైన్లలో భక్తులు పడుతున్న కష్టాలను పట్టించుకుని, పోలీసులను నియంత్రించే స్థాయిలో జిల్లా యంత్రాంగం జోక్యం కనిపించడం లేదు.
ఈవోకు అధికారం శూన్యం
ఆలయ ఈవో, దేవాదాయ శాఖ పాత్ర ఉత్సవాల్లో నామమాత్రమే. ఏర్పాట్లకు నిధులు సమకూర్చడం తప్ప కొండపై నిర్ణయాలు తీసుకునే అధికారం వారికి పెద్దగా ఉండదు.
ప్రోటోకాల్ దర్శనాలు తగ్గిస్తాం, సామాన్య భక్తులకే ప్రాధాన్యం అని ఈవో ఉత్సవాలకు ముందే ప్రకటించారు. ఏఐ ఆధారిత క్యూ నిర్వహణ, కప్పు ఉన్న క్యూలైన్లు, హోల్డింగ్ ఏరియాలు అంటూ ఏర్పాట్ల జాబితా చదివారు. కానీ కొండపై పెత్తనం పోలీసులదైనప్పుడు ఆ మాటలు అమలయ్యేది ఎంతవరకు?
తొలి రోజే అధికారి మార్పు
దేవాదాయ శాఖ ఉన్న కొద్ది పాత్రలోనూ తడబాటే. ఉత్సవాలు మొదలైన రోజే చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్‌ను తప్పించి, రాజమహేంద్రవరం రీజనల్ జాయింట్ కమిషనర్ వి. త్రినాథరావుకు బాధ్యతలు అప్పగించారు.
కూటమికి చెందిన ఓ కీలక నేత దర్శనం సమయంలో ఆజాద్ అతిగా వ్యవహరించడమే కారణమని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు వివాదాస్పద అధికారిగా పేరుందని తెలిసీ ఏటా ఉత్సవాల బాధ్యత ఎందుకు ఇస్తున్నారు? చివరి నిమిషంలో మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు.
ఇక్కడా ఒక విషయం స్పష్టమైంది. ఓ నేత అసంతృప్తి ఒక్క రాత్రిలో సీఎంవోకు చేరి అధికారి మారిపోయారు. గంటల తరబడి క్యూలో నలిగే లక్షల మంది భక్తుల ఇబ్బందులు మాత్రం ఏ కార్యాలయానికీ చేరడం లేదు.
దర్శనం దక్కుతుంది.. కానీ
కిలోమీటర్ల నడక, గంటల నిరీక్షణ, తోపులాటలు దాటి గర్భాలయం ముందుకు వెళ్తే క్షణం కూడా నిలబడనివ్వరు. అయినా అమ్మవారిని చూశామన్న తృప్తితోనే భక్తులు కొండ దిగుతున్నారు.
ఆ భక్తే యంత్రాంగానికి అలుసుగా మారింది. పోలీసులు, రెవెన్యూ, దేవాదాయ శాఖ.. ఏ శాఖ వైపు చూసినా భక్తుడి వైపు నిలబడే వారు కనిపించడం లేదు.
దుర్గమ్మా.. ఈ యంత్రాంగానికి ఎప్పుడు కనువిప్పు కలిగిస్తావమ్మా?
దుర్గాష్టమి వేళ ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి
వెస్ట్ బైపాస్ ప్రమాదం.. తప్పు ఎక్కడ?
సీఎంగా తొలిసారి బెజవాడకు విజయ్