సీఎంగా తొలిసారి బెజవాడకు విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మంగళవారం విజయవాడ వచ్చారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తర్వాత సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి.
చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విజయ్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్టుకు వచ్చారు. కొందరు ఆయన కారు వెంట పరుగులు తీశారు.
పంచెకట్టులో దుర్గమ్మ సన్నిధికి
పంచెకట్టులో ఆలయానికి వచ్చిన విజయ్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చి అమ్మవారి ప్రసాదం అందజేశారు.
దసరా శరన్నవరాత్రుల సమయం కావడంతో కొండపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తనను చూసి కేరింతలు కొట్టిన భక్తులకు విజయ్ చేతులు జోడించి నమస్కరించారు.
తెలుగు రాష్ట్రాలకు ఇన్నాళ్లూ దూరమే
విజయ్ సినిమాలు చాలా ఏళ్లుగా తెలుగులో విడుదలవుతున్నాయి. ఇక్కడ ఆయనకు పెద్ద అభిమాన గణం ఉంది. అయినా ఇటీవలి సంవత్సరాల్లో సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్‌కు గానీ, ఏపీకి గానీ ఆయన రాలేదు.
అలాంటి విజయ్ ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో బెజవాడ రావడం అభిమానుల్లో ఆసక్తి పెంచింది.
ఆహ్వానం ఎలా వచ్చింది?
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా ఉత్సవాలకు రావాలని కోరుతూ ఈ నెల 6న ఎంపీల బృందం చెన్నై వెళ్లి విజయ్ను కలిసింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి ఆ బృందంలో ఉన్నారు.
ఉత్సవ్‌కు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ నిర్వాహకులు పిలిచారు. దిల్లీ సీఎం రేఖా గుప్తా, బెంగాల్ సీఎం సువేందు అధికారి, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మలకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. అయితే అందరికంటే ముందుగా వచ్చింది విజయే.
చంద్రబాబుతో భేటీ
దుర్గమ్మ దర్శనం తర్వాత విజయ్ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. తన నివాసానికి వచ్చిన విజయ్ను చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సాదరంగా ఆహ్వానించారు.
మంత్రులు పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలను చంద్రబాబు విజయ్‌కు పరిచయం చేశారు. భేటీలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల ఉండటం గమనార్హం.
ఈ పర్యటనలో అసలు ఎజెండా కృష్ణా నీళ్లే. చెన్నై తాగునీటికి కృష్ణా జలాలే కీలక ఆధారం.
తెలుగుగంగ ఒప్పందం ప్రకారం ఏపీ ఏటా 12 టీఎంసీల కృష్ణా నీటిని తమిళనాడుకు ఇవ్వాలి. కానీ ఈ నెల 9 నాటికి సుమారు 2.25 టీఎంసీలు మాత్రమే అందినట్లు సమాచారం. మిగతా నీటి విడుదలపై విజయ్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
గోదావరి–కృష్ణా–కావేరి నదుల అనుసంధానం చంద్రబాబు చాలాకాలంగా చెబుతున్న ప్రణాళిక. ఈ అంశంతో పాటు, తమిళనాడు వైపు ప్రవహించే నదులపై ఏపీ ప్రతిపాదించిన ఆనకట్టలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. భేటీ వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
దుర్గాష్టమి వేళ ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి
వెస్ట్ బైపాస్ ప్రమాదం.. తప్పు ఎక్కడ?
దుర్గమ్మా.. యంత్రాంగానికి కనువిప్పు ఎప్పుడమ్మా?