డిజిటల్ చెల్లింపుల భద్రతపై ఎన్పీసీఐ కీలక నిర్ణయం
రోజూ ఉదయం పాల ప్యాకెట్ కొనే దగ్గరి నుంచి భారీ షాపింగ్‌ల వరకు అంతా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎమ్లలోనే జరిగిపోతోంది. అయితే, ఒక్క చిన్న పొరపాటుతో ఖాతా ఖాళీ అవుతున్న ఘటనలు రోజూ చూస్తూనే ఉన్నాం. ఈ ఆన్లైన్ దొంగతనాలకు, రాంగ్ పేమెంట్లకు అడ్డుకట్ట వేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సరికొత్త భద్రతా నిబంధనలను అందుబాటులోకి తెస్తోంది.
ఇకపై మీరు యూపీఐ పిన్ (PIN) టైప్ చేసిన వెంటనే ఖాతా నుంచి సొమ్ము కట్ కాకుండా ఆపేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, అమౌంట్ నొక్కి, పిన్ కొట్టగానే సెకన్లలో డబ్బులు అవతలి వ్యక్తులకు వెళ్లిపోతున్నాయి. తొందరపాటులో అకౌంట్ నంబర్లు సరిచూసుకోకపోవడం, లేదా సైబర్ నేరగాళ్ల వలలో పడి పిన్ ఎంటర్ చేసి నష్టపోవడం జరుగుతోంది.
దీనికి పరిష్కారంగా ‘డబుల్ వెరిఫికేషన్’ (రెండుసార్లు నిర్ధారణ) పద్ధతిని అమలు చేయనున్నారు.
“మీ ఖాతాలో డబ్బులు వేస్తున్నాం.. ఈ క్యూఆర్ స్కాన్ చేసి పిన్ కొట్టండి” అంటూ అమాయకులను బురిడీ కొట్టించే ముఠాల ఆటకట్టించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. పిన్ అనేది కేవలం డబ్బులు పంపడానికే తప్ప, స్వీకరించడానికి కాదనే విషయాన్ని కూడా స్క్రీన్‌పై స్పష్టంగా మెసేజ్ రూపంలో ప్రాంప్ట్ చేయనున్నారు.
కొత్త వ్యక్తులకు పెద్ద మొత్తంలో (రూ.10,000 కంటే ఎక్కువ) డబ్బులు పంపేటప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత విశ్లేషణ జరుగుతుంది. లావాదేవీపై ఏమాత్రం అనుమానం వచ్చినా సదరు పేమెంట్‌ను కొన్ని నిమిషాల పాటు హోల్డ్‌లో ఉంచుతారు. ఆ సమయంలో వినియోగదారుడు సదరు పేమెంట్‌ను క్యాన్సిల్ చేసుకునే సదుపాయం కూడా లభిస్తుంది.