నేవీలో పాక్ గూఢచారి.. విజయవాడ పోలీసుల వలలో సైలర్
దేశ రక్షణ రహస్యాలు శత్రుదేశానికి చేరుతున్నాయా?
విశాఖ నౌకాదళ సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో ఓ నేవీ సైలర్ అరెస్టయ్యాడు. ఈ ఆపరేషన్ నడిపింది విజయవాడ కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్.
పట్టుబడిన వ్యక్తి పేరు ప్రదీప్ ముఖర్జీ. వయసు 31 ఏళ్లు. పశ్చిమ బెంగాల్‌కు చెందినవాడు.
శనివారం (అక్టోబర్ 3) తమిళనాడులోని కోయంబత్తూరు ఐఎన్ఎస్ అగ్రాని నేవీ శిక్షణ కేంద్రంలో ఏపీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టును కేంద్ర నిఘా వర్గాలు కూడా ధ్రువీకరించాయి.
ప్రదీప్ 2014లో నేవీలో చేరాడు. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఈస్ట్రన్ నావల్ కమాండ్ పరిధిలో సైలర్‌గా పనిచేస్తున్నాడు.
అసలు కథ మొదలైంది సోషల్ మీడియాలో.
కొన్ని నెలల క్రితం ఓ మహిళతో ప్రదీప్‌కు ఆన్లైన్లో పరిచయం అయ్యింది. ఆమె పాకిస్థాన్ నిఘా సంస్థకు పనిచేసే ఆపరేటివ్ అని అధికారులు అనుమానిస్తున్నారు.
మొదట స్నేహం. తర్వాత సన్నిహితం. ఆ క్రమంలోనే నేవీ రహస్యాలు ఆమెకు చేరాయని దర్యాప్తు వర్గాల అనుమానం. హనీట్రాప్ కోణంలోనూ విచారణ సాగుతోంది.
విశాఖ నౌకాదళ స్థావరంలోని కీలక ఆస్తులు, యుద్ధనౌకల కదలికలు, కార్యకలాపాల వివరాలు బయటకు వెళ్లాయని పోలీసులు ఆరోపిస్తున్నారు.
అయితే ఏ పత్రాలు లీకయ్యాయి? ఆ సమాచారం ఎంత కీలకం? దేశ భద్రతకు ఎంత నష్టం? ఈ ప్రశ్నలకు ఇంకా అధికారిక సమాధానం రాలేదు.
మరి పోలీసులకు ఎలా దొరికాడు?
ప్రదీప్ ఆన్లైన్ కార్యకలాపాల్లో అనుమానాస్పద డిజిటల్ ఆనవాళ్లు కనిపించాయి. అప్పటి నుంచే కౌంటర్ ఇంటెలిజెన్స్ అతడిపై నిఘా పెట్టింది. నేవీ అధికారులతో కలిసి పక్కా ప్లాన్‌తో పట్టుకుంది.
అరెస్టు తర్వాత స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం విజయవాడలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ కార్యాలయానికి తరలించారు.
ప్రాథమిక దర్యాప్తు పూర్తయ్యాక కేసును ఎన్ఐఏకు అప్పగించే అవకాశం ఉంది.
దుర్గాష్టమి వేళ ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి
వెస్ట్ బైపాస్ ప్రమాదం.. తప్పు ఎక్కడ?
సీఎంగా తొలిసారి బెజవాడకు విజయ్