కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు అందరి నోళ్లలో ఒకటే మాట — వంగవీటి రాధా ఎమ్మెల్సీ పదవి ఈసారైనా దక్కుతుందా? ఈ చర్చకు కారణం గవర్నర్ కోటాలో ఖాళీ అవుతున్న రెండు స్థానాలు. వైఎస్సార్‌సీపీ నామినీలు జాకియా ఖానం, పండుల రవీంద్రబాబు పదవీకాలం వచ్చే నెలలో ముగియనుండటంతో, ఈ రెండు సీట్లు అధికార కూటమిలో టీడీపీ ఖాతాలోకే వెళ్తాయని అంతా అంచనా వేస్తున్నారు. దీంతో పార్టీలో సీట్లు వదులుకున్న సీనియర్ నేతల మధ్యే అసలైన పోటీ మొదలైంది.
ఈ రేసులో రెండు పేర్లు ముందు వరుసలో ఉన్నాయి — వంగవీటి రాధాకృష్ణ, దేవినేని ఉమామహేశ్వరరావు. ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వీరు ఇప్పుడు ఒకే పార్టీలో ఒకే పదవి కోసం పోటీ పడుతుండటం గమనార్హం.
వంగవీటి రాధా ప్రాధాన్యం మళ్ళీ పెరుగుతుందా?
వంగవీటి రంగా వారసుడైన రాధాకృష్ణకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. 2019లో వైఎస్సార్‌సీపీ వదిలి టీడీపీలో చేరినప్పుడు, పార్టీ అధికారంలోకి వస్తే తగిన స్థానం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో రాధా రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకమైంది. వరుసగా కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైఎస్సార్‌సీపీ, ఆఖరికి టీడీపీ అంటూ పార్టీలు మారుతూ రాజకీయంగా ఎదురుదెబ్బలు తిని ప్రాధాన్యత కోల్పోయారు. దాదాపు పదేళ్లుగా ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దీంతో “ఇన్నేళ్ళు యాక్టివ్‌గా లేని వ్యక్తికి ఇప్పుడు పెద్ద పదవి ఎందుకివ్వాలి” అనే ప్రశ్న టీడీపీలోనే వినిపిస్తోంది. అయితే కాపు సామాజికవర్గానికి ఆకట్టుకునే క్రమంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే యోచనలో చంద్రబాబు, లోకేష్ ఉన్నట్టు తెలుస్తోంది. కానీ టీడీపీలోనే అదే సామాజికవర్గానికి చెందిన కొందరు నేతలు మాత్రం రాధాను వ్యతిరేకిస్తున్నారు — ఎందుకంటే జనసేన అధినేత సోదరుడు నాగబాబుకు ఇప్పటికే ఎమ్మెల్సీ దక్కడంతో, అదే వర్గానికి మరో పదవి ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
అందరికీ దూరమైన పదవిపై ఆశలతో దేవినేని
ఇక దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయ అనుభవం కారణంగా ఆయన పేరు ఎమ్మెల్సీ పదవికి బలంగా వినిపిస్తోంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆయన బలం. మైలవరం సీటును వసంత కృష్ణ ప్రసాద్ కోసం త్యాగం చేసి, ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవకతవకల ఆరోపణలు ఎదుర్కొన్నారు, గత ప్రభుత్వ హయాంలో కేసుల్లో పేరు చుట్టుముట్టి కోర్టు నుంచి ఉపశమనం పొందాల్సి వచ్చింది. అయినప్పటికీ, సీనియారిటీకి ప్రతిఫలం దక్కాలనే వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఒకప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన అవే రాజకీయాల దెబ్బకి ఒక మూలన ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన హవా నడిచినప్పుడు అందరినీ దూరం చేసుకోవడం, సీనియర్ నాయకులందరితో విభేదాలు, అవకాశవాదం ఆయన పతనానికి కారణాలుగా చెబుతారు. అయితే చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం, పార్టీ బ్యాక్‌గ్రౌండ్‌ను బట్టి ఆయన ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు.
చంద్రబాబు లెక్కలు ఏంటి?
రాజకీయ వర్గాల టాక్ ప్రకారం, “సీటు త్యాగం చేసినవారికే ముందు ప్రాధాన్యం” అనే ఫార్ములా చంద్రబాబు ఆలోచనల్లో కనిపిస్తోంది. ఈ లెక్కన పిఠాపురం వర్మతో పాటు దేవినేని ఉమా పేరు ఖరారుకు దగ్గరగా ఉన్నట్టు సమాచారం. అయితే వంగవీటి రాధా ఎమ్మెల్సీ విషయంలో పాత హామీ భారం ఇంకా మిగిలే ఉండటం, సామాజికవర్గ సమీకరణాలు కూడా పనిచేస్తుండటంతో ఆఖరి నిమిషంలో ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
విజయవాడ, కృష్ణా జిల్లా రాజకీయాలను ఆసక్తిగా గమనించేవారికి ఇది కచ్చితంగా వేచి చూడాల్సిన పరిణామమే. జాబితా ఖరారైతేనే వంగవీటి రాధా ఎమ్మెల్సీ కల నెరవేరుతుందా, లేక మళ్ళీ ఆయనకు నిరాశే మిగులుతుందా అనేది స్పష్టమవుతుంది.