రాష్ట్ర ఖజానాలో డబ్బు మొత్తం ఉద్యోగుల జీతాలకే ఖర్చు అయిపోతోందా? నిజంగానే ప్రభుత్వం చేతిలో డబ్బు మిగలడం లేదా? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా మారింది.
కారణం ఏంటంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఒక సంచలన లెక్క చెప్పారు. రాష్ట్ర ఆదాయంలో 98 శాతం వరకు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే పోతోందట! ఈ మాట వినగానే సామాన్యులు నోరెళ్లబెట్టారు. “అంత డబ్బు జీతాలకే పోతే, మనకి అభివృద్ధికి ఏం మిగులుతుంది?” అనే ప్రశ్న అందరి మనసుల్లో మెదిలింది.
కానీ ఈ లెక్క వెనుక అసలు నిజాలు వేరేగా ఉన్నాయని ఇప్పుడు ఆధారాలతో సహా బయటకొస్తున్నాయి. అవేంటో చూద్దాం రండి.
కాగ్ లెక్కలు చెప్తున్నదేంటి?
ఏపీ కాంట్రాక్టు, పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (APCPSEA) ఈ 98 శాతం లెక్కపై నేరుగా సవాలు విసిరింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (C&AG) అధికారిక గణాంకాల ప్రకారం 2022-23లో రాష్ట్ర ఆదాయంలో జీతాలు, వేతనాల వాటా కేవలం 34.14 శాతం మాత్రమే. పెన్షన్ల వాటా 14.31 శాతం, వడ్డీ చెల్లింపుల వాటా 16.16 శాతం. ఇవన్నీ కలిపినా మొత్తం 64.62 శాతమే వస్తుంది. మరి 98 శాతం అనే అంకె ఎక్కడి నుంచి పుట్టిందో ప్రభుత్వమే చెప్పాలని నిలదీసింది.
జీతాల వాటా పెరగలేదు, తగ్గింది!
అసలు కథ ఇక్కడే ట్విస్ట్ తిరుగుతుంది. జీతాల భారం పెరగడం లేదు, ఏటికేడు తగ్గుతోంది. 2016-17లో రాష్ట్ర ఆదాయంలో జీతాల వాటా 31.44 శాతం ఉండగా, 2021-22 నాటికి 29.23 శాతానికి, 2023-24 నాటికి కేవలం 21.22 శాతానికి పడిపోయింది.
మరి ఏది పెరిగింది? పెన్షన్ల వాటా 13.01 శాతం నుంచి 16.07 శాతానికి పెరిగింది. అంతకంటే ఎక్కువగా, ఏకంగా రెట్టింపు స్థాయిలో పెరిగింది వడ్డీ చెల్లింపుల భారం — 11.82 శాతం నుంచి 19.66 శాతానికి ఎగబాకింది!
అంటే రాష్ట్ర ఖజానాకు చిల్లు పెడుతున్నది ఉద్యోగుల జీతాలు కాదు, ప్రభుత్వం చేస్తున్న అప్పులు, వాటిపై కడుతున్న వడ్డీలు అని ఈ లెక్కలే కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి.
“37 శాతమే” అంటున్న ఏపీ జేఏసీ
ఏపీ జేఏసీ అమరావతి కూడా ఇదే విషయంపై బాంబు పేల్చింది. చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కాగ్ నివేదికల ప్రకారం 2025-26లో రాష్ట్రం చేసిన మొత్తం రెవెన్యూ ఖర్చులో ఉద్యోగులు, పెన్షనర్లకు వెళ్లింది కేవలం 37.41 శాతమేనని తేల్చిచెప్పారు. మూలధన వ్యయం మినహాయిస్తే ఇది 38 శాతమని, ఇవన్నీ కాగ్ వెబ్సైట్లోనే అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.
30 వేల కోట్లు చెల్లించారా? అసలు ఎవరికి?
ఇక ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న “30 వేల కోట్ల చెల్లింపు”పైనా పెద్ద ప్రశ్నలు లేచాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన చెల్లింపుల్లో ఎక్కువ భాగం రిటైర్డ్ ఉద్యోగులకు వారు సర్వీసులో ఉన్నప్పుడే దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్ డబ్బులేనని బొప్పరాజు వెల్లడించారు. అంటే ఇది కొత్తగా ఇచ్చిన డబ్బు కాదు, ఉద్యోగుల సొంత సొమ్మే! సర్వీసులో ఉన్న ఉద్యోగులకు మాత్రం కొత్త ప్రయోజనాలేమీ అందలేదని, సరెండర్ లీవులు కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ సచివాలయ సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి కూడా ఇదే అనుమానం లేవనెత్తారు. కూటమి ప్రభుత్వమే స్వయంగా 2024 జులైలో విడుదల చేసిన శ్వేతపత్రంలో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు 22,980 కోట్లు మాత్రమేనని రాశారని, అందులో కూడా చాలా భాగం ఇప్పటికీ చెల్లించలేదని ఆధారాలతో సహా చూపించారు. “మరి 30 వేల కోట్లు ఎవరికి చెల్లించారు?” అని సూటిగా ప్రశ్నించారు.
రిటైర్మెంట్లు పెరిగితే జీతాల ఖర్చు ఇంకా తగ్గుద్ది!
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రాబోయే రోజుల్లో జీతాల ఖర్చు మరింత తగ్గబోతోందని బొప్పరాజు వెల్లడించారు. 2024 నుంచి 2026 మధ్య ఇప్పటికే 41,321 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. 2035 నాటికి మరో 1,51,755 మంది రిటైర్ కాబోతున్నారు. అంటే ఇప్పుడున్న జీతాల ఖర్చులో సగానికిపైగా దానంతట అదే తగ్గిపోతుంది!
ఉద్యోగులు భారమా? వెన్నెముకా?
ఉద్యోగులను భారంగా చూపించే ముందు ఒక్క క్షణం ఆలోచించండి — ఉపాధ్యాయులు, వైద్యులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది రోజూ మీకు సేవలందిస్తున్నదెవరు? APCPSEA ఇదే ప్రశ్న వేసింది. ఉద్యోగులు రాష్ట్రానికి భారం కాదని, పరిపాలనకు వెన్నెముక అని స్పష్టం చేసింది. “98% జీతాలకే” అనే ప్రచారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, పూర్తి పారదర్శకంగా లెక్కలు ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేసింది.
మొత్తానికి ప్రభుత్వం చెప్పే లెక్కలకు, అధికారిక కాగ్ గణాంకాలకు మధ్య భారీ అంతరం స్పష్టంగా కనిపిస్తోంది. నిజం ఎటువైపు ఉందో మీరే నిర్ణయించుకోండి!