బెజవాడ బులెటిన్ వార్తలు మాత్రమే కాదు.. మీకు అవసరమైన సమాచారం కూడా
విజయవాడ

బెజవాడ అమ్మాయికి ఆస్ట్రేలియాలో శాంతి పురస్కారం

30 September 2026 2 నిమిషాల చదువు
బెజవాడ అమ్మాయికి ఆస్ట్రేలియాలో శాంతి పురస్కారం
సిడ్నీలో శాంతి పురస్కారం అందుకున్న ధన్య వసంత

పన్నెండేళ్ల వయసులో మనం ఏం చేశాం? ఆటలు, చదువు, టీవీ.. అంతేగా!

కానీ బెజవాడకు చెందిన ఓ అమ్మాయి అదే వయసులో ఒక ఉద్యమం మొదలుపెట్టింది. ఇప్పుడు అదే ఉద్యమం ఆమెకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఆ అమ్మాయి పేరు ధన్య వసంత. విజయవాడ మూలాలున్న ఈ తెలుగు అమ్మాయి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో 12వ తరగతి చదువుతోంది.

ఆస్ట్రేలియాలో ప్రతిష్ఠాత్మకమైన ‘డేమ్ మేరీ బషీర్ పీస్ ప్రైజ్ 2026’ ఆమెను వరించింది. సెప్టెంబర్ 28న సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర పార్లమెంటులో ఈ అవార్డు అందుకుంది.

ఇంతకీ ఈ అవార్డు ఎందుకు వచ్చిందో తెలుసా?

ఒక్క పుస్తకాల కోసం.

పన్నెండేళ్ల వయసులో ధన్య ‘ఎ లిటిల్ లైబ్రరీ’ అనే కార్యక్రమం మొదలుపెట్టింది. మొదట 200 పుస్తకాలను వెస్ట్‌మీడ్ చిల్డ్రన్స్ ఆసుపత్రికి దానం చేసింది.

ఆసుపత్రి బెడ్ మీద ఉన్న పిల్లలకు ఆ పుస్తకాలే తోడయ్యాయి.

అక్కడితో ఆగలేదు. ఒక్కో పుస్తకం పోగు చేస్తూ ఇప్పటివరకు పది వేలకు పైగా పుస్తకాలు సేకరించింది.

వాటిని ఆస్ట్రేలియాలోని మారుమూల ప్రాంతాల పిల్లలకు పంపింది. సముద్రాలు దాటి ఆఫ్రికా దేశాల పిల్లలకూ చేర్చింది.

ఇదొక్కటే కాదు. గత నాలుగేళ్లుగా ప్రతి వారం ఓ మ్యూజిక్ థెరపీ క్లినిక్‌లో వాలంటీర్‌గా పనిచేస్తోంది.

శారీరక వైకల్యం ఉన్న పిల్లలు మాట్లాడటం, ధైర్యంగా ఉండటం నేర్చుకునేందుకు సాయం చేస్తోంది.

యువత గొంతు వినిపించే కార్యక్రమాల్లోనూ ముందుంటోంది. నార్తర్న్ బీచెస్ యూత్ అడ్వైజరీ గ్రూప్‌లో సభ్యురాలిగా పనిచేస్తోంది.

ఈ సేవలన్నీ గుర్తించే ఆస్ట్రేలియా ఆమెకు శాంతి పురస్కారం ఇచ్చింది.

ఇంకో విశేషం ఏంటంటే.. ధన్య ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు మనవరాలు.

విదేశాల్లో ఉన్నా మన తెలుగు మూలాలు ఎక్కడికీ పోలేదని ధన్య మరోసారి చూపించింది.

షేర్ చేయండి