ఐదు జిల్లాలు.. 97 ఊర్లు.. 19 ఇంటర్‌ఛేంజ్‌లు
అమరావతి ఓఆర్ఆర్ రూట్ మ్యాప్ ఇదే
కృష్ణాపై రెండు భారీ వంతెనలు.. కొండల్లో మూడు సొరంగాలు
₹11,537 కోట్ల పనులకు టెండర్లు.. నవంబర్ 19న ఖరారు
అమరావతి ఓఆర్ఆర్ సాధారణ హైవే కాదు. ఎక్కడ పడితే అక్కడ ఎక్కడానికి, దిగడానికి కుదరదు.
ఇది "యాక్సెస్ కంట్రోల్డ్" రోడ్డు. 190 కి.మీ. రింగ్‌లో వాహనాలు ఎక్కి దిగేది కేవలం 19 పాయింట్ల దగ్గరే. అవే ఇంటర్‌ఛేంజ్‌లు.
ఎన్హెచ్ఏఐ టెండర్లు పిలవడంతో, ఈ 19 పాయింట్ల చుట్టుపక్కల ఊర్లకు ఇప్పుడు ఒక్కసారిగా ప్రాధాన్యం పెరిగింది.
17 నుంచి 19కి: ఎన్హెచ్ఏఐ మొదట 17 ఇంటర్ఛేంజ్లే ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం అడగడంతో మరో రెండు పెంచింది. ఎక్కడైతే జాతీయ, రాష్ట్ర రహదారులు ఓఆర్ఆర్ను దాటుతాయో, సరిగ్గా అక్కడే వీటిని ప్లాన్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లాలో నాలుగు: రింగ్ మొదలయ్యేది కంచికచర్ల దగ్గర విజయవాడ–హైదరాబాద్ హైవే మీదే. అక్కడే మొదటి ఇంటర్‌ఛేంజ్ వస్తుంది.
తర్వాత పొన్నవరం దగ్గర ఒకటి. చెవిటికల్లు, జుజ్జూరు, ఎర్రుపాలెం వైపు వెళ్లేవాళ్లు ఇక్కడ ఎక్కి దిగొచ్చు.
దుగ్గిరాలపాడు దగ్గర విజయవాడ–ఖమ్మం కారిడార్‌తో కలుస్తుంది. మైలవరం దగ్గర భద్రాచలం రోడ్డుతో కలుస్తుంది.
నూజివీడు–గన్నవరం వైపు: విజయవాడ నుంచి ఈదర, సీతారామపురం మీదుగా నూజివీడు వెళ్లే రోడ్డు ఆగిరిపల్లి మండలం బొద్దనపల్లె దగ్గర ఓఆర్ఆర్ను దాటుతుంది. అక్కడ ఇంటర్‌ఛేంజ్ వస్తుంది.
ఆగిరిపల్లి మీదుగా నూజివీడు వెళ్లే మరో రోడ్డుకు ఆగిరిపల్లి దగ్గర ఇంకోటి వస్తుంది.
పొట్టిపాడు దగ్గర కోల్‌కతా–చెన్నై హైవేని దాటుతుంది. వెన్నూతల దగ్గర గన్నవరం–హనుమాన్ జంక్షన్ రోడ్డుకు కనెక్షన్ ఉంటుంది.
కృష్ణా జిల్లా–తెనాలి వైపు: మణికొండ దగ్గర కంకిపాడు–గుడివాడ రోడ్డుతో కలుస్తుంది. చలివేంద్రపాలెం–దావులూరు దగ్గర విజయవాడ–మచిలీపట్నం హైవేతో కలుస్తుంది.
కృష్ణా దాటాక నందివెలుగు దగ్గర గుంటూరు అంతర్గత రోడ్లకు దారి ఉంటుంది. తెనాలి వైపు కాజ వరకు 17.5 కి.మీ. స్పర్ రోడ్డు ప్రతిపాదన కూడా ఉంది.
గుంటూరు–పల్నాడు వైపు: నారాకోడూరు దగ్గర బుడంపాడు మీదుగా గుంటూరుకు దారి. KKR & KSR కాలేజీ దగ్గర స్థానిక యాక్సెస్ పాయింట్.
పుల్లడిగుంట దగ్గర గుంటూరు–ప్రత్తిపాడు రోడ్డు. లింగాయపాలెం దగ్గర మళ్లీ కోల్‌కతా–చెన్నై హైవే.
మేడికొండూరు దగ్గర గుంటూరు–అనంతపురం రోడ్డు. బలుసుపాడు దగ్గర పెదకూరపాడు–అమరావతి రోడ్డు.
అంటే కోల్‌కతా–చెన్నై హైవేని, విజయవాడ–మచిలీపట్నం–హైదరాబాద్ హైవేని ఓఆర్ఆర్ రెండేసి చోట్ల దాటుతుంది.
రోడ్డు స్వరూపం: ఓఆర్ఆర్ పొడవు 189.93 కి.మీ., ఆరు వరుసలు. దీనికి తోడు నారాకోడూరు నుంచి బుడంపాడు దగ్గర చెన్నై–కోల్‌కతా హైవే వరకు 5.2 కి.మీ. నాలుగు వరుసల అనుసంధాన రోడ్డు ఉంటుంది. మొత్తం 195.13 కి.మీ.
వాహనాలు గంటకు 100 కి.మీ. వేగంతో వెళ్లేలా డిజైన్ చేశారు. ఆరు జాతీయ రహదారులు, ఏడు రాష్ట్ర రహదారులు, ఒక జిల్లా రహదారిని ఈ రోడ్డు దాటుతుంది.
ఐదు జిల్లాలు.. 97 ఊర్లు: ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 23 మండలాలు, 97 గ్రామాల మీదుగా రోడ్డు వెళ్తుంది. గతంలో 121 గ్రామాల మీదుగా అని ప్రకటించారు. తాజా టెండర్లో ఆ సంఖ్య 97కు తగ్గింది.
కృష్ణాపై రెండు వంతెనలు: మొదటిది వల్లూరుపాలెం నుంచి మున్నంగి (వల్లభాపురం) వరకు. రెండోది అమరావతి దగ్గర తుమ్మవరం నుంచి కృష్ణా జిల్లా మున్నలూరు వరకు. రెండూ కలిపి 8 కి.మీ.కు పైగా పొడవు ఉంటాయి.
వీటికి తోడు వాగులు, వంకలపై 20 పెద్ద, 95 చిన్న వంతెనలు కడతారు.
కొండల్లో సొరంగాలు: గంగినేనిపాలెం–మైలవరం మధ్య కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ కొండలను తొలిచి రెండు సొరంగాలు, పేరేచర్ల దగ్గర ఒక చిన్న సొరంగం నిర్మిస్తారు. మూడూ కలిపి దాదాపు 5 కి.మీ.
8 లేన్లకు ఛాన్స్ లేదు: గతంలో భవిష్యత్తులో 8 వరుసలకు పెంచుకునేలా సొరంగాలు ప్రతిపాదించారు. ఇప్పుడు 6 వరుసల డిజైన్‌కు మార్చారు. దాంతో భవిష్యత్తులో రోడ్డు విస్తరించాలంటే ఈ మూడు చోట్ల కొత్త సొరంగాలు తవ్వాల్సిందేనని అధికారులే చెబుతున్నారు.
మొదటి ప్యాకేజీ: కంచికచర్ల నుంచి కొండపల్లి, పంగిడి అడవుల మీదుగా మైలవరం వరకు. 27.93 కి.మీ., ₹2,975 కోట్లు. ఇది అన్నింటికంటే చిన్నది, కానీ సొరంగాల వల్ల కిలోమీటరుకు ఖర్చు ఎక్కువ.
రెండో ప్యాకేజీ: మైలవరం నుంచి కృష్ణవరం, తేలప్రోలు, మణికొండ మీదుగా కంకిపాడు మండలం కోలవెన్ను వరకు. 56 కి.మీ., ₹2,865 కోట్లు. పూర్తిగా మైదాన ప్రాంతం.
మూడో ప్యాకేజీ: కోలవెన్ను నుంచి కృష్ణా దాటి వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట వరకు. 50.5 కి.మీ., బుడంపాడు స్పర్‌తో కలిపి ₹2,828 కోట్లు.
నాలుగో ప్యాకేజీ: పుల్లడిగుంట నుంచి పేరేచర్ల, నెమలికల్లు, అమరావతి మీదుగా కృష్ణా దాటి మళ్లీ కంచికచర్ల వరకు. 55.5 కి.మీ., ₹2,870 కోట్లు.
భూమి 8 వేల ఎకరాలు: ఐదు జిల్లాల్లో కలిపి 3,251 హెక్టార్లు, అంటే సుమారు 8 వేల ఎకరాలు సేకరిస్తారు. ఇందుకు గెజిట్ నోటిఫికేషన్ ఇప్పటికే వచ్చింది. భూసేకరణకే ₹5,315 కోట్లు అవుతుందని అంచనా. మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు ₹30,491 కోట్లు.
ఊర్ల మధ్య దారి: రోడ్డుకు అటు ఇటు ఉండే ఊర్ల మధ్య రాకపోకల కోసం 105 అండర్‌పాస్‌లు, 8 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు కడతారు. 34 చోట్ల హైటెన్షన్ విద్యుత్ లైన్లను దాటాల్సి వస్తుంది.
అండర్‌పాస్‌లు ఏ ఊరి దగ్గర వస్తాయో ఇంకా బయటకు రాలేదు. పొలాలకు, పక్క ఊళ్లకు వెళ్లే దారి ఎంత దూరం అవుతుందనేది అదే తేలుస్తుంది.
ఇప్పుడు 40.. తర్వాత 60: పనులు హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో జరుగుతాయి. నిర్మాణ సమయంలో ప్రభుత్వం 40 శాతం మాత్రమే దశలవారీగా చెల్లిస్తుంది. మిగతా 60 శాతం గుత్తేదారే సొంతంగా లేదా బ్యాంకు అప్పుతో పెడతాడు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం 10–15 ఏళ్ల పాటు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తుంది.
అనుమతులకు ముందే టెండర్లు: కేంద్ర పీపీపీ అప్రైజల్ కమిటీ, ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్ కమిటీ అనుమతులు త్వరలో వస్తాయనే ధీమాతో ఎన్హెచ్ఏఐ ముందుగానే టెండర్లు పిలిచింది. పర్యావరణ, అటవీ క్లియరెన్సులు కూడా ఇంకా రావాలి.
గడువు మూడేళ్లు: నవంబర్ 18 ఉదయం 11 గంటల వరకు బిడ్లు వేయొచ్చు. 19న టెండర్లు తెరుస్తారు. నాలుగు ప్యాకేజీలనూ 1,095 రోజుల్లో, అంటే మూడేళ్లలో పూర్తి చేయాలి. టెండర్లను దిల్లీలోని ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయమే పర్యవేక్షిస్తుంది.
దుర్గాష్టమి వేళ ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి
వెస్ట్ బైపాస్ ప్రమాదం.. తప్పు ఎక్కడ?
సీఎంగా తొలిసారి బెజవాడకు విజయ్