అమరావతి డీప్ టెక్ క్యాపిటల్‌గా మారనుంది. ఇదే ఇప్పుడు రాజధానికి కొత్త లక్ష్యం. కేవలం ప్రభుత్వ కార్యాలయాల నగరంగా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో హబ్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీన్, బ్లూ, పొల్యూషన్-ఫ్రీ, డీప్-టెక్ సిటీగా అమరావతిని అభివృద్ధి చేయాలన్నది ప్రధాన లక్ష్యం.
ఇందులో భాగంగా ఇటీవలే యూఎన్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ (UNICC)తో ఒప్పందం జరిగింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో AI, క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కానుంది. వాషింగ్టన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ STEM (WISER)తో కలిసి టాలెంట్ హబ్ కూడా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 62 వేల మందికి పైగా శిక్షణ పొందారు, 2026లో 3.5 లక్షల మందికి, 2027లో 6 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వాలన్నది టార్గెట్.
IBM, BharatGen, NexGen లాంటి సంస్థలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా AI టెక్ హబ్ నిర్మించే ప్రణాళిక కూడా ఉంది. 22 భారతీయ భాషలను, 500కు పైగా సొంత GPUలను, స్వదేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ను ఇంటిగ్రేట్ చేస్తూ ‘స్వదేశీ AI స్టాక్’ తయారుచేయనున్నారు. గవర్నెన్స్, వ్యవసాయం, విద్య, MSMEలకు ఇది ఉపయోగపడుతుంది.
విద్యార్థుల కోసం IIT మద్రాస్, Bodhan AI భాగస్వామ్యంతో ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో AI ట్యూటర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతోపాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) సౌత్ ఇండియా మొదటి క్యాంపస్ కూడా అమరావతిలోనే రానుంది. ఇది AI, క్వాంటమ్ టెక్, సెమీకండక్టర్ స్కిల్స్ కోసం ప్రత్యేకంగా పనిచేస్తుంది.
రాజధాని ప్రాంతంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా వేగంగా రూపుదిద్దుకుంటోంది. రెండు రోజుల క్రితమే (ఆగస్టు 13న) ₹1,519 కోట్లతో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డు, ఉండవల్లి వద్ద స్టీల్ బ్రిడ్జిలు అందుబాటులోకి వచ్చాయి . ఇవి అమరావతిని మంగళగిరి, తాడేపల్లి, విజయవాడలతో కలుపుతాయి. కేంద్రం ఇప్పటికే 190 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్, 96 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్‌కు కూడా మంజూరు ఇచ్చింది.
విశాఖపట్నం కూడా టెక్ రేసులో వెనుకబడి లేదు. అక్కడ గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో అతిపెద్ద AI డేటా సెంటర్ నిర్మిస్తోంది. అంటే రాజధాని ప్రాంతం, విశాఖ రెండూ కలిసి రాష్ట్రాన్ని టెక్ మ్యాప్‌లో బలంగా నిలబెట్టే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.