అమరావతిలో భూముల ధరలు. ఈ టాపిక్‌పై రోజూ ఏదో ఒక వార్త వింటూనే ఉన్నాం. కానీ ఈసారి వచ్చిన నంబర్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎకరాకు రూ.8.20 కోట్లు.
అవును. రాజధానిలో స్టార్ హోటళ్ల కోసం CRDA నిర్ణయించిన భూమి ధర ఇది. అమరావతి చరిత్రలో CRDA నోటిఫై చేసిన ధరల్లో ఇదే అత్యధికం. హోటళ్లు, స్కూళ్ల కోసం తాజాగా బిడ్లు కూడా ఆహ్వానించింది.
ఎక్కడ కడతారు ఈ హోటళ్లు?
తుళ్లూరు, రాయపూడి, వెంకటపాలెం. ఈ మూడు చోట్ల మొత్తం ఐదు హోటళ్లు రానున్నాయి. మూడు త్రీ-స్టార్, రెండు ఫోర్-స్టార్. వీటికోసం 9.19 ఎకరాలు కేటాయించారు.
త్రీ-స్టార్ హోటల్ కట్టాలంటే కనీసం రూ.75 కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఫోర్-స్టార్ అయితే 175 గదులు తప్పనిసరి. దాంతోపాటు 2,500 మంది కూర్చునే కన్వెన్షన్ హాల్ కూడా ఉండాలి. అంటే చిన్నాచితకా బిల్డర్లకు ఇది సాధ్యమయ్యే వ్యవహారం కాదన్నమాట.
ఇంకో ముఖ్య విషయం. ఈ భూములు ఫ్రీహోల్డ్. అంటే కొన్నవాళ్లకే పూర్తి యాజమాన్య హక్కులు.
స్కూళ్లకు మాత్రం లీజు.. ఎందుకు?
హోటళ్లతో పాటు ఐదు ప్రైవేట్ స్కూళ్లకూ CRDA భూమి ఇస్తోంది. LKG నుంచి ఇంటర్ వరకు నడిపే స్కూళ్ల కోసం 15.80 ఎకరాలు రిజర్వ్ చేశారు. కానీ ఇక్కడ తేడా ఉంది. స్కూళ్లకు అమ్మకం కాదు. 33 ఏళ్ల లీజు మాత్రమే. ధర ఎకరాకు రూ.4.10 కోట్లు.
అసలు రూ.8.20 కోట్లు ఎక్కువా తక్కువా?
రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రభుత్వం ఇటీవల ఖరారు చేసిన ధరలు చూడండి.. నెల్లూరు క్రిస్ సిటీలో ఎకరా రూ.1.74 కోట్లు. ఓర్వకల్లులో రూ.1.50 కోట్లు. కడపలో రూ.1.25 కోట్లు. అమరావతి హోటల్ భూమి వీటికంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ.
మరో లెక్క.. ఎకరాకు రూ.8.20 కోట్లు అంటే గజానికి సుమారు రూ.17 వేలు. “అదేంటి, రాజధాని గ్రామాల్లో చిన్న ప్లాట్లే గజం రూ.30–45 వేలు పలుకుతున్నాయి కదా?” అనిపించొచ్చు. నిజమే. కానీ ఇవి రెండూ వేర్వేరు లెక్కలు. మార్కెట్లో అమ్ముడయ్యేవి చిన్న నివాస ప్లాట్లు. CRDA ఇచ్చేది ఏకంగా ఎకరాల్లో ఒకే పార్సెల్. కోట్లలో పెట్టుబడి పెట్టాలనే షరతులతో.
ఏదేమైనా, ప్రభుత్వమే అధికారికంగా ఈ స్థాయి ధర ప్రకటించడంతో. అమరావతిలో భూముల ధరలకి ఒక కొత్త బెంచ్‌మార్క్ వచ్చినట్లయింది.ఏదేమైనా, ప్రభుత్వమే అధికారికంగా అమరావతి భూమికి ఈ స్థాయి ధర ప్రకటించడం రాజధాని మార్కెట్‌కు ఒక కొత్త బెంచ్‌మార్క్. ప్రస్తుతం అమరావతిలో రూ.55 వేల కోట్లకు పైగా పనులు జరుగుతున్నాయి. 2028 అక్టోబర్ నాటికి ప్రభుత్వ టవర్లు పూర్తవుతాయని మంత్రి నారాయణ ఇప్పటికే ప్రకటించారు. ఆ టైమ్‌లైన్‌కి ముందే హోటళ్లు, స్కూళ్లు రావడం అంటే రాజధానిలో జనజీవనం మొదలవుతోందనే సంకేతం.
ఇదీ చదవండి…