వార్తలు & సమాచార హబ్  |  అమరావతి · విజయవాడ · గుంటూరు
Tuesday, July 28, 2026
విజయవాడ  38°C ☀️
వార్తలు

22ఏ భూముల ప్రక్షాళన

📅 July 23, 2026 ✍ News Desk ⏱ 1 నిమిషాల చదువు
ఏపీ 22-ఎ నిషేధిత భూముల జాబితా జీవో 444 కొత్త నిబంధనలు

నిషేధిత భూముల జాబితా (22A Prohibited Land) ప్రక్షాళనకు ఏపీ ప్రభుత్వం జీవో 444తో సమగ్ర ఉత్తర్వులు జారీ చేసింది. ఏళ్లుగా కొనసాగుతున్న గందరగోళానికి తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఉత్తర్వులు జారీ చేసింది. అకారణంగా జాబితాలో చేరిన భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో.. చేర్పులు, తొలగింపులకు స్పష్టమైన విధివిధానాలు నిర్దేశిస్తూ రెవెన్యూ శాఖ జీవో 444 విడుదల చేసింది. ఈ అంశంపై గతంలో జారీ చేసిన సర్క్యులర్లు, మెమోలన్నీ రద్దవుతాయని అందులో పేర్కొంది.


ఇకపై రాష్ట్రమంతటికీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ (ఐజీఆర్‌ఎస్‌) వద్ద ఉండే కేంద్రీకృత డేటాబేసే ఏకైక ప్రామాణికం. దాన్ని కాకుండా మరే జాబితా ఆధారంగా రిజిస్ట్రేషన్‌ నిరాకరించినా సంబంధిత అధికారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. వ్యవసాయ భూముల వివరాలను వెబ్‌ల్యాండ్‌ 2.0 నుంచే తీసుకోవాలని, మాన్యువల్‌ ఎంట్రీలకు తావుండరాదని స్పష్టం చేసింది.


పట్టా భూములైతే రిజిస్ట్రేషన్‌ పక్కా..
వెబ్‌ల్యాండ్‌లో ‘పట్టా’గా నమోదైన భూములు నిషేధిత జాబితాలో కనిపించినా సరే.. రిజిస్ట్రేషన్లు చేయాల్సిందేనని అధికారులను ఆదేశించడం ఈ ఉత్తర్వుల్లో అతిపెద్ద ఊరట. పొరపాటున జాబితాలో చేరిన పట్టా భూములను ఆర్డీవోలు వెంటనే తొలగించాలి. ఒక సర్వే నంబరులో కొంత భాగమే ప్రభుత్వానిదైనప్పుడు మొత్తం సర్వే నంబరును నిషేధించిన చోట్ల.. మిగిలిన సబ్‌ డివిజన్లకు రిజిస్ట్రేషన్లు జరపాలని స్పష్టం చేశారు. పట్టణ ఆస్తులకు 2007 జూన్‌ 20కి ముందు నాటి లింకు దస్తావేజులుంటే రిజిస్ట్రేషన్‌ నిరాకరించరాదని పేర్కొన్నారు. గ్రామకంఠం భూములను జాబితాలో చేర్చరాదని.. 1954 జూన్‌ 18కి ముందు అసైన్‌ చేసిన భూములు, గ్రామ సేవా ఈనాం, షరతుల గల పట్టా భూములను తొలగించాలని ఆదేశించారు.


నోటీసు లేకుండా చేర్చారో.. చర్యలే!
ఇకపై ఏ భూమినైనా జాబితాలో చేర్చాలంటే బాధిత పక్షాలకు కనీసం 15 రోజుల ముందస్తు నోటీసు ఇచ్చి, విచారణ జరిపి, కారణాలతో కూడిన ఉత్తర్వు జారీ చేయాల్సిందే. నిర్మాణాలున్న స్థలాలు, ఎవరైనా అనుభవంలో ఉన్న భూముల్లో నోటీసు లేకుండా చేర్పులు చేస్తే బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎకరం మించిన వ్యవసాయ భూమి, వెయ్యి చదరపు గజాలు దాటిన వ్యవసాయేతర ఆస్తులను జాబితాలో చేర్చే అధికారాన్ని ప్రభుత్వానికే పరిమితం చేశారు.


అన్యాయం జరిగితే అప్పీలుకు దారి..
జాబితా చేర్పులపై ఆర్డీవో ఉత్తర్వులతో నష్టపోయిన వారు 60 రోజుల్లోగా జాయింట్‌ కలెక్టర్‌కు అప్పీలు చేసుకోవచ్చు. అప్పీలును జేసీ 60 రోజుల్లో పరిష్కరించి, వారంలోగా డేటాబేసులో మార్పులు చేయాలి. జేసీ ఉత్తర్వులపైనా అభ్యంతరాలుంటే 90 రోజుల్లోగా ప్రభుత్వానికి రివిజన్‌ దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. కోర్టు ఉత్తర్వులు, గెజిట్‌ నోటిఫికేషన్‌ ఆధారాల్లేని ‘కోర్టు కేసుల’ ఎంట్రీలు, నకిలీ ఎంట్రీలను మూడు నెలల్లో తొలగించాలని.. ఈ మార్పులన్నింటికీ అవసరమైన సాఫ్ట్‌వేర్‌ సవరణలను 90 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది.

🔗 ఈ వార్తను షేర్ చేయండి
📰 సంబంధిత వార్తలు
📰 తాజా వార్తలు
📢 Advertisement
300×250
Google AdSense