📍 విజయవాడ, ఆంధ్రప్రదేశ్  |  Friday, September 11, 2026
💬 📘
వార్తలు

సర్కారుపై ఉద్యోగుల సమరశంఖం.. ఇక ‘వర్క్ టు రూల్’

📅 September 1, 2026 ✍ News Desk ⏱ 0 నిమిషాల చదువు
AP employees protest and work to rule agitation

అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమం వేడెక్కుతోంది. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి దశలవారీ ఆందోళనకు సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉద్యమ కార్యాచరణ నోటీసులను జేఏసీ నేతలు అందజేశారు. దీంతో రానున్న రోజుల్లో ఉద్యోగుల నిరసనలు మరింత ఉధృతం కానున్నాయి.

ఉద్యమంలో భాగంగా సెప్టెంబర్ 1 నుంచే నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉద్యోగులు తమ వాట్సాప్ డీపీలను మార్చుకోవడంతో పాటు సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. అలాగే కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో నిరసనలు చేపట్టనున్నారు.

సెప్టెంబర్ 11న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, ఇతర డిమాండ్లపై చర్చించి తదుపరి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయనున్నారు.

సెప్టెంబర్ 15 నుంచి కీలక దశ

ఉద్యోగుల ఉద్యమంలో సెప్టెంబర్ 15 కీలక తేదీగా మారనుంది. ఆ రోజు నుంచి 26వ తేదీ వరకు ‘వర్క్ టు రూల్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉద్యోగులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విధులు నిర్వహిస్తూ, నిబంధనలకు మించి అదనపు పనులకు దూరంగా ఉండనున్నారు.

అదే సమయంలో ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయనున్నారు. ఉద్యోగులు తమ సమస్యలను తెలియజేసేలా డీపీలు, ఫొటోలు, రీల్స్ ద్వారా ప్రచారం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 15 నుంచి 25 వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందజేయనున్నారు.

సెప్టెంబర్ 17న నల్ల కండువాలతో నిరసనలు, మానవహారాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23న కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 26న ఉద్యోగుల కుటుంబ సభ్యులను కూడా ఉద్యమంలో భాగస్వాములను చేసి ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు.

ప్రభుత్వం స్పందించకపోతే..

ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఏపీ జేఏసీ అమరావతి నేతలు స్పష్టం చేస్తున్నారు. తదుపరి దశలో రిలే నిరాహార దీక్షలు, సహాయ నిరాకరణ, ఛలో విజయవాడ వంటి కార్యక్రమాలకు వెళ్లే అవకాశం ఉంది. అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా సిద్ధమవుతామని జేఏసీ హెచ్చరిస్తోంది.

ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు నోటీసులు ఇవ్వడం, నిరసన కార్యక్రమాలను ప్రారంభించడం, సెప్టెంబర్ 15 నుంచి వర్క్ టు రూల్‌కు వెళ్లాలని నిర్ణయించడం ద్వారా ఉద్యోగుల ఉద్యమం ఒక్కో దశలో వేగం పెంచుతోంది. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

🔗 ఈ వార్తను షేర్ చేయండి
📰 సంబంధిత వార్తలు
📰 తాజా వార్తలు
📢 Advertisement
300×250
Google AdSense