రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 6,212.50 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయంతో పాటు పలు శాఖలకు సంబంధించిన మొత్తం 29 అంశాలకు ఆమోదం లభించింది.
అమరావతి మీదుగా ప్రతిపాదించిన ఎర్రుపాలెం–నంబూరు కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్, 100 మీటర్ల బఫర్, ఇన్నర్ రింగ్ రోడ్, క్యాపిటల్ సిటీ సరిహద్దు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ వరకు గ్రిడ్ రోడ్ల విస్తరణ కోసం భూ సమీకరణ చేపట్టనున్నారు.
రైతుల అభ్యర్థన మేరకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌ను అమలు చేసేందుకు ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌కు కేబినెట్ అధికారం ఇచ్చింది. గుంటూరు జిల్లా కంతేరు గ్రామంలో 974 ఎకరాలు, తాడికొండ మండల పరిధిలో 5,238.50 ఎకరాలు కలిపి మొత్తం 6,212.50 ఎకరాలు సమీకరించనున్నారు.
శాకమూరు వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్‌తో కూడిన ‘అమరావతి సంఘమం’ నిర్మాణానికి రూ.759.793 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతి ఇచ్చింది.
ఈ ప్రాజెక్టుకు డీపీఎల్ నుంచి రూ.310.080 కోట్లు, ఏపీహెచ్‌ఆర్‌డీఐ నుంచి రూ.277.949 కోట్లు, ఏపీసీఆర్‌డీఏ నుంచి రూ.171.764 కోట్ల నిధులు సమకూరనున్నాయి.
అమరావతిలోని టైప్-B, C, D, E ఎల్‌పీఎస్ రోడ్లకు సిమెంట్ కాంక్రీట్‌కు బదులుగా బిటుమినస్ రోడ్ల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాష్ట్ర పోలీసు శాఖలో పాతబడిన వాహనాల స్థానంలో 4,760 కొత్త వాహనాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మంగళగిరి ఎస్‌బీఐ–ఎస్‌ఎంఈ బ్రాంచ్ నుంచి రూ.324.20 కోట్ల టర్మ్ లోన్‌ను ప్రభుత్వ పూచీకత్తుతో తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
జల్ జీవన్ మిషన్ 2.0 కింద గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న తాగునీటి పనులను పూర్తి చేసేందుకు రూ.4,053.85 కోట్లతో 13,252 పనులను పునర్వ్యవస్థీకరించి చేపట్టనున్నారు.
సింగిల్ విలేజ్ స్కీమ్‌లలోని 13,247 పనులను హేతుబద్ధీకరించి రూ.3,046.11 కోట్లతో 7,439 పథకాలుగా, మల్టీ విలేజ్ స్కీమ్ కింద 334 గ్రామాలకు ప్రయోజనం చేకూరేలా రూ.1,007.74 కోట్లతో 5 పథకాలను చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ డెవలప్‌మెంట్ పాలసీ 2026–29కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆధునిక పౌల్ట్రీ షెడ్లు, బయోసెక్యూరిటీ, వ్యాధుల నియంత్రణ, ప్రాసెసింగ్, కోల్డ్‌చైన్, ఎగుమతులను ప్రోత్సహించడం ఈ విధానం లక్ష్యం.
పాలసీ కింద వివిధ ప్రోత్సాహకాల కోసం రూ.657.18 కోట్ల ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రతిపాదించారు.
2026 సీజన్‌లో తక్కువ నాణ్యత పొగాకుకు కిలోకు రూ.10 చొప్పున ధరల లోటు భర్తీ మద్దతును రైతులకు నేరుగా నగదు బదిలీ ద్వారా అందించేందుకు రూ.94 కోట్లను సమకూర్చనున్నారు.
తోతాపురి మామిడికి మద్దతు ధర అమలు కోసం అవసరమైన నిధులను స్వల్పకాలిక రుణాల ద్వారా సమీకరించుకునేందుకు మార్క్‌ఫెడ్‌కు అనుమతిని పొడిగించారు.
రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిని 50 నుంచి 100 పడకలకు పెంచేందుకు ఆమోదం తెలిపింది. మంగళగిరి అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు కోసం 21 రెగ్యులర్ పోస్టులను మంజూరు చేసింది.
పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో ధర వ్యత్యాసంగా జీఎస్టీతో కలిపి రూ.557.97 కోట్లను ఎన్‌హెచ్‌పీసీ విధానం ప్రకారం పరిగణనలోకి తీసుకునేందుకు అనుమతించింది.
కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 78 వరద నష్ట పునరుద్ధరణ పనులకు రూ.624.88 లక్షల విలువైన పరిపాలనా అనుమతులను ధ్రువీకరించింది.
చిత్తూరు జిల్లాలో పలు పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వ భూములను ఏపీఐఐసీకి బదిలీ చేసేందుకు, మార్కాపురంలో కొత్త సమీకృత కలెక్టరేట్ కోసం 20.01 ఎకరాల భూమిని బదిలీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
దువ్వూరులో 25 ఎకరాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు, విజయవాడ రూరల్ మండలం వేమవరంలో 10.12 ఎకరాలను జెట్ సిటీలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు కేటాయించేందుకు అనుమతించింది.
గ్రామీణ నీటి సరఫరా పథకాల్లో సింగిల్ విలేజ్ స్కీమ్‌లకు రెండేళ్ల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్, మల్టీ విలేజ్ స్కీమ్‌లకు రెండేళ్ల డీఎల్‌పీతో పాటు 10 ఏళ్ల పనితీరు ఆధారిత నిర్వహణ విధానాన్ని అమలు చేయనున్నారు.